
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో నిన్న(జూలై 24) రిలీజైన 'హరిహర వీరమల్లు'కి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. హిట్ అని పవన్ అభిమానులు హడావుడి చేస్తున్నారు గానీ రెండు రోజులు ఆగితే అసలు ఫలితం ఏంటో తెలుస్తుంది. సరే దీని గురించి పక్కనబెడితే ఓటీటీల్లోనూ బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. షో టైమ్, మార్గన్ తదితర తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍లోకి రాగా.. మరో మూడు తెలుగు మూవీస్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంతకీ ఏంటవి?
సునీల్, చైతన్యరావు, శ్రద్దాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''పారిజాత పర్వం'. గతేడాది ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. నెల తిరగకుండానే అప్పుడే ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏడాది తర్వాత మరో ఓటీటీలోకి వచ్చేసింది. లయన్స్ గేట్ ప్లేలో తాజాగా స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా విషయానికొస్తే.. ఓ కుర్రాడు డైరెక్టర్ కావాలనుకుంటాడు. కానీ అడ్డంకులు వచ్చేసరికి ఓ నిర్మాతని కిడ్నాప్ చేయాలనుకుంటాడు. కానీ ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటనేది మూవీ స్టోరీ.
(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))
'ఈగ', 'బాహుబలి' తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచమైన కన్నడ హీరో సుదీప్.. 2017లో చేసిన సినిమా 'హెబ్బులి'. దీన్ని ఇప్పుడు 'సారథి' పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశారు. ఆహా ఓటీటీలోకి సడన్‌గా తీసుకొచ్చేశారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో సుదీప్ ఆర్మీ అధికారిగా నటించగా.. ఇతడి సరసన అమలాపాల్ హీరోయిన్‌గా చేసింది.
2023లో వచ్చిన తెలుగు మూవీ 'దక్ష'. ఆయుష్ తేజస్, ఆర్య అను హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. హారర్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఆరుగురు స్నేహితులు ఓ గెస్ట్ హౌస్‌లో పార్టీ చేసుకుంటూ 'చాసర్' అనే గేమ్ ఆడతారు. గేమ్ ఓడిపోయిన వారు చనిపోతారని తెలుసుకుంటారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇలా ముందు ప్రకటించనవే కాకుండా కొత్తగా ఈ మూడు తెలుగు సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ)