
రీసెంట్ టైంలో బాలీవుడ్‌లో ఓ యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ మూవీ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే 'సయారా'. జూలై 18న థియేటర్లలోకి వచ్చింది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడిన ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))

కథేంటి?
వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్‌ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది. ఇతడో యువ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
రీసెంట్ టైంలో ఏ ఇండస్ట్రీలో చూసినా సరే లవ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ పెద్దగా రావట్లేదు. అందరూ హారర్, యాక్షన్, పీరియాడికల్ అంటూ పాన్ ఇండియా ట్రెండ్ వెంటపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో సింపుల్ ప్రేమకథ, మనసుకు హత్తుకునే పాటలతో వచ్చిన హిందీ సినిమానే 'సయారా'. ఇప్పటివరకు చాలా ప్రేమకథలు వచ్చాయి. వాటిలో ఒకలాంటిదే ఇది కూడా. స్టోరీ పరంగా కొత్తగాం ఏం ఉండదు. చాలాసార్లు చూసేశాం అనిపిస్తుంది. కాకపోతే స్టోరీని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.
పెళ్లి బట్టలతో వాణి బత్రా.. రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లిన సీన్‌తో సినిమా మొదలవుతుంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దీంతో కొన్నాళ్ల పాటు బాధతో ఇంటికే పరిమితమవుతుంది. అలా ఆరు నెలల తర్వాత తిరిగి బాహ్య ప్రపంచంలో అడుగుపెడుతుంది. రైటర్‌గా ఓ చోట జాబ్‌లో జాయిన్ అవుతుంది. అదే రోజు తన ఆఫీస్‌కి వచ్చి ఒకడ్ని కొడుతున్న సింగర్ క్రిష్ కపూర్‌ని ఈమె చూస్తుంది. అలా అక్కడ వీళ్లిద్దరికీ మొదలైన పరిచయం కాస్త ఎక్కడి వరకు వెళ్లింది? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ.
హిందీ ఆడియెన్స్ ఈ సినిమా చూసి తెగ ఎమోషనల్ అయిపోతున్నారు గానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది ఓకే ఓకే అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఎమోషనల్‌గానే అనిపిస్తాయి. మరీ ముఖ్యంగా గతం మర్చిపోయిన వాణి ముఖంలో అమాయకత్వం చూస్తే అయ్యో అనిపిస్తుంది. అలానే పాటలు కూడా దేనికవే బాగుంటాయి. మరీ సూపర్ అని చెప్పాం గానీ ఓ మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.

ఎవరెలా చేశారు?
క్రిష్ కపూర్‌గా చేసిన అహన్ పాండే, వాణిగా చేసిన అనీత్ పడ్డాకి ఇదే తొలి సినిమా. కానీ అద్భుతంగా చేశారు. అదిరిపోయే కెమిస్ట్రీ పండించారు. కొన్ని క్లోజప్ షాట్స్‌లో హీరోయిన్‌ని చూస్తుంటే మనల్ని కూడా ఇలాంటి అమ్మాయి ప్రేమిస్తే బాగుండు అనిపిస్తుంది. అంతా బాగుంటుంది మరి. మిగిలిన వాళ్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ మోహిత్ సూరి.. తనకు అచ్చొచ్చిన లవ్ రొమాంటిక్ జానర్‌లో మరో మంచి మూవీ తీశాడు. సినిమాటోగ్రఫీ, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేశాయి.
ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో, అది కూడా హిందీలో మాత్రమే ఉంది. ప్రేమలో ఉన్నోళ్లు, ప్రేమలో విఫలమైనోళ్లు ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఎమోషనల్ అయ్యే అవకాశముంది. ఒకవేళ బిగ్ స్క్రీన్‌పై చూస్తే ఆసక్తి లేదంటే కొన్నాళ్లు ఆగితే నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)