
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో, స్వచ్ఛమైన, కల్తీ లేని భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది,ఆరేళ్ల మరాఠీ బాల కళాకారిణి త్రిషా తోసర్ జాతీయ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు పొందిన మరాఠీ చిత్రం ‘‘నాల్ 2’’లో చిమి (రేవతి)గా అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు థోసర్‌ను జాతీయ పురస్కారం వరించింది. మళయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వంటి సెలబ్రిటీలతో పాటు ఎందరో అతిరధ మహారధులు సాక్షిగా ఆమె ఆ పురస్కారాన్ని అందుకుంటూంటే హర్షధ్వానాలు మారుమోగాయి. ఈ చిన్నారి విజువల్స్ కూడా వేగంగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి, ఆమెను టాక్ ఆఫ్ ద సినీ సర్కిల్¯గా మార్చి చర్చనీయాంశంగా చేశాయిు.

ఈ సందర్భంగా ఆమె స్పందన కూడా అందర్నీ ఆకట్టుకుంది. ‘ ఇంత గొప్ప గౌరవాన్ని స్వీకరించడానికి వేదికపైకి వెళ్ళినప్పుడు, ఆడిటోరియం మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. నా తల్లిదండ్రులు పెద్దలు అందరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు, మనస్ఫూర్తిగా గట్టిగా ఏడ్చారు. చప్పట్లు కొట్టారు, ఏమి సాధించానో నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఒక్కటి తెలుసు – ఈ అవార్డు ద్వారా, నా మహారాష్ట్ర. నా మొత్తం కుటుంబం పేరు ఉన్నత స్థాయికి చేరుకుందని. నా తల్లి చెప్పినట్లుగా, గత 70 సంవత్సరాల జాతీయ అవార్డులలో, ఈ గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కురాలినని. నా ఈ విజయానికి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి, నా చిత్ర బృందానికి, నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసిన నా దర్శకుడు సుధాకర్ యక్కంటికి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన సీనియర్ జ్యూరీ సభ్యులందరికీ, ముఖ్యంగా, నా ప్రియమైన ప్రేక్షకులకు, ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

మీ మద్దతు వల్లనే నేను ఇంత చిన్న వయస్సులో ఈ స్థానానికి చేరుకోగలిగాను. మీ ప్రేమ మద్దతు ఎల్లప్పుడూ నాతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇంతే బాధ్యత నిజాయితీతో పని చేస్తూనే ఉంటానని హామీ ఇస్తున్నాను’’ అంటూ స్పందించింది. ఈ స్పందన కూడా బాగా వైరల్ అవడంతో పాటు ఆమెను కాబోయే స్టార్ గా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఈ సందర్భఃగా అభినయ లోకనాయకుడు కమల్ హాసన్ ఆ చిన్నారిని మనసారా కొనియాడారు. తాను ఒకప్పుడు సాధించిన మైలురాయిని అధిగమించినందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు . కళతూర్ కన్నమ్మ అనే తమిళ సినిమా ద్వారా జాతీయ అవార్డ్ సాధించిన కమల్ ఆ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన బాల నటుడిగా రికార్డ్ సృష్టించారు. ఈ రికార్డ్‌ను ఇప్పుడు త్రిష తిరగరాసింది. ఈ సందర్భంగా కమల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఆయన స్పందించారు. ‘‘ప్రియమైన త్రిషా తోషర్, నా హర్షధ్వానాలు నీకు దక్కుతాయి.

నా మొదటి అవార్డు వచ్చినప్పుడు నాకు అప్పటికే ఆరేళ్ల వయసు...నువ్వు నా రికార్డును అధిగమించావు. ఇలాగే కొనసాగండి మేడమ్. మీ అద్భుతమైన ప్రతిభతో పని చేస్తూనే ఉండండి. ఇంట్లోని మీ పెద్దలకు నా ప్రశంసలు.‘ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఆ చిన్నారి బాల నటికి అభినయ శిఖరం లాంటి కమల్ నుంచి అందుకున్న ఈ పొగడ్త మరో అత్యున్నత పురస్కారంతో సమానం అనడంలో సందేహం లేదు.