రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. అయితే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు.
ఈ సినిమాలో పాకిస్తాన్ వ్యతిరేక సందేశం ఉందనే కారణంతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో 'ధురంధర్'(Dhurandhar)పై బ్యాన్ విధించారు. ఈ ప్రాంతంలో భారతీయ యాక్షన్ సినిమాలు సాధారణంగా బాగా ఆడతాయని, ఈ బ్యాన్ వల్ల కనీసం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) నష్టం వచ్చిందని ప్రణబ్ కపాడియా పేర్కొన్నారు.
తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘మిడిల్ ఈస్ట్ మార్కెట్ యాక్షన్ సినిమాలకు చాలా ముఖ్యం. ఈ బ్యాన్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్లు అయింది. అయినా, డిసెంబర్ హాలిడే సీజన్‌లో ప్రేక్షకులు ఇతర దేశాలకు ట్రావెల్ చేసి సినిమా చూస్తున్నారు’ అని కపాడియా తెలిపారు.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. నార్త్ అమెరికా, యూరప్ మార్కెట్లలో బాగా ఆడినా, గల్ఫ్ బ్యాన్ వల్ల మరింత వసూళ్లు రావాల్సి ఉండగా... ఆ అవకాశం చేజారిపోయింది.ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్ 2’ను రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే ప్రకటించింది.


