ఆస్కార్‌లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ | Marty Supreme Movie Telugu Review OTT | Sakshi
Sakshi News home page

Marty Supreme Review: స్పోర్ట్స్ డ్రామా హిట్ మూవీ.. ఓటీటీ తెలుగు రివ్యూ

May 24 2026 6:27 PM | Updated on May 24 2026 6:37 PM

Marty Supreme Movie Telugu Review OTT

ఓటీటీలోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులు వెతుకుతూనే ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు తమిళ, మలయాళ, ఇంగ్లీష్ చిత్రాలు డబ్బింగుల రూపంలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే హాలీవుడ్‌లో హిట్ అయిన స్పోర్ట్స్ డ్రామా 'మార్టీ సుప్రీమ్' వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలో మన దగ్గర థియేటర్లలో రిలీజైంది. 70 మిలియన్ డాల‍ర్ల బడ్జెట్‌తో తీస్తే 190 మిలియన్ డాలర్ల వసూలు చేసింది. ఈ ఏడాది ఆస్కార్స్‌లో తొమ్మిది విభాగాల్లో నామినేట్ కూడా అయింది. కానీ అవార్డులేం గెలుచుకోలేకపోయింది. ఇప్పుడిది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఇలాంటి టాక్‌తో 'దృశ్యం 3'కి రూ.100 కోట్ల కలెక్షన్ ఎలా సాధ్యం?)

కథేంటంటే?
అది 1950ల కాలం. అమెరికాలో ఉండే మార్టీ(టిమోతీ చలమెట్) అనే కుర్రాడికి ఓ కల ఉంటుంది. పెద్ద టేబుల్ టెన్నిస్ టోర్నీలో పాల్గొని గెలవాలని అనుకుంటూ ఉంటాడు. కానీ అందుకోసం చాలా డబ్బులు కావాలి. సదరు టోర్నమెంట్ జరగడానికి చాలా తక్కువ సమయముంటుంది. మరి ఇంత తక్కువ టైంలో మార్టీ అంత డబ్బులు ఎలా సంపాదించాడు? టోర్నీలో పాల్గొన్నాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
సాధారణంగా స్పోర్ట్ డ్రామాలు అనగానే ఓ అనామక వ్యక్తి.. ఏదో ఒక గేమ్ నేర్చుకోవడం, తర్వాత ప్రాక్టీస్ చేయడం, చివరకు విజేత కావడం.. దాదాపు ఇదే ఫార్మాట్‌లో ఉంటుంది. కానీ 'మార్టీ సుప్రీమ్' మాత్రం కాస్త డిఫరెంట్. పేరుకే స్పోర్ట్ డ్రామా కానీ సక్సెస్ కోసం ఓ మనిషి ఎంత దూరం వెళ్తాడు? ఫేమ్ కోసం ఎంతలా స్వార్థపరుడు అవుతాడు అనే అంశాలు చాలా పచ్చిగా చూపించారు.

రెండున్నర గంటల ఈ మూవీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. టేబుల్ టెన్నిస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. అయితే ఈ గేమ్ కంటే మిగతా విషయాల్ని ఎక్కువగా చూపించారు. అంటే మార్టీ జీవితం, చుట్టూ ఉండే మనుషులు, ఎదురైన పరిస్థితులు ఇతడిని ఎలా మార్చేశాయనేది అసలు కథ.

ఈ సినిమాని మార్టీ రేస్‌మన్ అనే అమెరికన్ దిగ్గజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడి జీవితం ఆధారంగా తీశారు. అయితే నిజ జీవిత సంఘటనలకు కాస్త కల్పితం జోడించారు. ఇందులో హీరోకి ఉన్న ప్లస్సులే కాదు మైసస్సుల కూడా చూపించడం విశేషం. సినిమాలో స్టైల్, టెన్షన్, యాక్టింగ్ అన్ని బాగున్నాయి. కానీ ఎమోషనల్ కనెక్ట్ ఇంకాస్త బలంగా ఉంటే నెక్స్ట్ లెవల్ మూవీ అయ్యేది. ఇది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాదు. చెప్పాలంటే ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ప్రతి సీన్‌లోనూ ఓ టెన్షన్ ఉంటుంది. ఎమోషనల్ డెప్త్ కంటే స్టైల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తుంది. 1950లో అమెరికా వాతావరణాన్ని ఫెర్ఫెక్ట్‌గా చూపించారు. దానికి తోడు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి.

ఈ సినిమాలోని హీరో కమ్ ఓ నిర్మాత అయిన టిమోతీ చలమెట్.. మార్టీగా అదరగొట్టేశాడు. అయితే మిగతా వాటిలో కొన్ని పాత్రలని సరిగా ముగించలేదు. వేగంగా ఉండే ఎడిటింగ్ వల్ల కొన్ని సన్నివేశాలు గందరగోళంగా అనిపిస్తాయి. చాలామంది ఇది టేబుల్ టెన్నిస్ డ్రామా అనుకుంటారు కానీ మూవీలో గేమ్ అనేది ఓ స్పోర్ట్ కాదు ఇదో యుద్ధంలా ఫీలై ప్రతి మ్యాచులో టెన్షన్ తెప్పించే విధానం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో గేమ్ కంటే మైండ్ గేమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. చీటింగ్, మ్యానిపులేషన్, ఈగో క్లాషెస్ లాంటి వాటిని చాలా బాగా చూపించారు. ఈ అంశాలే దీన్ని స్పోర్ట్ డ్రామాలా కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ జోన్‌లోకి తీసుకెళ్తాయి. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు గానీ కొన్ని అసభ్యకర సీన్స్ ఉంటాయి కాబట్టి కుటుంబంతో కలిసి చూడొద్దు. ఏదైనా కాస్త డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి: బండ్ల గణేశ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement