
మహేశ్‌బాబు అనగానే టక్కున గురొచ్చేది రాజకుమారుడు లాంటి అందం. నేడు ఆయన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కానీ, ఇది కేవలం నంబర్ మాత్రమే.. వయసుతో సంబంధం లేకుండా గ్లామర్‌తో చూపు తిప్పుకోనివ్వడు. ఇప్పటికీ టీనేజర్‌లా ఉంటాడు. తన తనయుడికి సోదరుడిలా కనిపిస్తారు. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అనే ప్రశ్నకు ప్రిన్స్ మహేశ్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. అయితే, ఆయన కేవలం అందంతో మాత్రమే కాదు.. వ్యక్తిత్వంతోనూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. టక్కరిదొంగలా అభిమానుల మనసు దోచేశాడు. నాన్న నుంచి నేర్చుకున్న పాఠాలతో తన జీవితానికి బంగారు బాటలు వేసుకున్నాడు. పేద చిన్నారులకు సాయం చేయడంలో ఆయనకు ఎవరూ సరిలేరు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం.
ఎప్పుడూ తప్పుచేయని జీవితం
మహేశ్‌బాబు ఎప్పుడూ కూడా నవ్వుతూనే కనిపిస్తారు. ముఖంమీద చెరగని చిరునవ్వే నిజమైన అందమని ఒకసారి మహేశ్ పంచుకున్నారు. అయితే, ఆ నవ్వు మనస్ఫూర్తిగా రావాలని, అందుకు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని అన్నారు. జీవితంలో తాను చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రధాన కారణం ఎప్పడూ కూడా తప్పు చేయకపోవడమేనని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి తప్పు చెయ్యనని.. అది తన మీద తనకున్న నమ్మకం అంటూ.. అది నాన్న నుంచి నేర్చుకున్నానని పలుమార్లు మహేశ్ చెప్పారు.

చిట్టి గుండెలను కాపాడే 'సేవియర్'
మహేశ్ ఎన్నో చిట్టి ‘గుండె’లను కాపాడారు. ఇప్పటి వరకు ఏకంగా 4500 మంది చిన్నారుల ప్రాణాలకు ఊపిరిలూది రియల్ హీరో అనిపించుకున్నారు. సాయం కోసం చేయి చాచిన వారందరికి అండగా నిలుస్తూ.. పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించాలని మహేశ్ దంపతులు నిర్ణయించుకున్నారు. విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ ద్వారా మహేశ్‌బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేల మంది చిన్నారులకు ఇప్పటికే వైద్య సాయం అందించారు. తెలంగాణలో ఉండేవావి కోసం ఇబ్బంది లేకుండా ‘ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్’ పేరిట హైదరాబాద్‌లోనూ గుండె ఆపరేషన్లు చేయించడం మొదలుపెట్టారు. దీంతో అభిమానులు ఆయన్ను ఏకంగా దేవుడిలా పూజిస్తారు. 'రాళ్లలో దేవుడున్నాడో లేదో మాకు తెలీదు.. కానీ ఇన్ని ప్రాణాలు కాపాడిన మా మహేశ్వరుడిలో ఖచ్చితంగా ఉన్నాడు' అంటూ పొంగిపోతారు.

స్థాపనకు ప్రేరణ
మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు గుండె సంబంధిత సమస్య ఎదుర్కొన్నాడు. అయితే, తనకు ఆర్థికంగా సౌలభ్యం ఉండటంతో సర్జరీ చేయించగలిగాడు. కానీ, డబ్బుల్లేక చిన్నారులు చికిత్స పొందలేక పోతున్నారనే ఆలోచన మహేష్‌ను ఎంతో కలవరపెట్టింది. అందుకే, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత గుండె ఆపరేషన్లు అందించేందుకు ఈ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఫౌండేషన్ వెబ్‌సైట్ ద్వారా డైరెక్ట్‌గా రిక్వెస్ట్ పెట్టే అవకాశం కల్పించడం విశేషం. మహేశ్ బాబు ఫౌండేషన్‌ను ఆయన తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి 2020లో స్థాపించారు.

నిధులు ఎలా..?
మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏటా సుమారు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం ఉంది. మహేష్ బాబు తన సంపాదనలో సుమారు 30% భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, బాలికలకు గర్భకోశ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు, పాఠశాలకు కంప్యూటర్లతో పాటు మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలకు ఆయన చేసిన అభివృద్ధి పనులు నిజంగా ప్రశంసనీయం. ఆయన 2016లో ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం మరియు తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడి ఆసుపత్రుల నుంచి బడుల వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.

రియల్ హీరోగా మహేష్.. సాయం కోసం ఇలా 'ధరఖాస్తు' చేయండి
మహేష్ బాబు తన సినీ జీవితంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ఆదర్శంగా మొదటి నుంచి నిలుస్తున్నారు. అభిమానులు ఆయనను "మహేశ్వరుడు" అని పిలుస్తూ, దేవుడిగా భావిస్తున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్‌సైట్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. పేద పిల్లల హార్ట్ సర్జరీ కోసం డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోనే https://www.maheshbabufoundation.org/request/ రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఇందులో పూర్తి వివరాలతో నమోదు చేసుకుంటే మహేశ్ టీమ్ మిమ్మల్నే సంప్రదిస్తుంది. కొద్దిరోజుల క్రితం ప్రతి మహేష్ బాబు ఫ్యాన్ తమ సోషల్ మీడియా బయోలో ఫౌండేషన్ లింక్‌ను షేర్ చేశారు. సోషల్‌మీడియాలో నెటిజన్లు కూడా ఆయన్ను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఫ్యాన్ వార్ పేరుతో కొందరు మహేశ్‌ను టార్గెట్ చేసినా.. ఆయన చేసిన మంచిపనులే తిరిగి సమాధానం చెప్తాయి.

సూపర్‌స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్
ఇటీవల ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా (Superstar Krishna Educational Fund)ను ప్రారంభించారు, ఇది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు ఉద్దేశించబడింది. మొదటి ఏడాదిలోనే 40మందికి పైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి ఈ స్కాలర్‌షిప్ అందించారు. పాఠశాల చదువు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య పెంచుకుంటూ పోతారు.

తండ్రికి తగ్గ కూతురు
మహేష్ బాబు ముద్దుల కూతరు సితారకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. పీఎంజే అనే జ్యువెలరీ కంపెనీ యాడ్‌లో నటించిన సితారకు సుమారు రూ. 1 కోటి పైగానే రెమ్యునరేషన్ వచ్చింది. అయితే తనకు వచ్చిన మొదటి పారితోషికాన్ని ఒక చారిటీకి విరాళంగా ఇచ్చేసింది. ఈ విరాళం వృద్ధుల ఆరోగ్యం, ఆహారం, అవసరాల కోసం ఉపయోగించబడింది. తండ్రి బాటలోనే సేవా దృక్పథం వైపు అడుగులు వేసిన సితారను ఎందరో అభినందించారు.
టాలీవుడ్‌లో తిరుగులేని రికార్డ్స్
మహేశ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాల్లో నటించలేదు. ఆయన సినిమాలు కనీసం రెండు మూడు భాషల్లో కూడా విడుదల కాలేదు. కేవలం తెలుగులోనే విడుదలయ్యాయి. ఈ క్రమంలో కేవలం టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగేసి ఆయన రికార్డ్స్‌ను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ భాషా చిత్రాలుగా పాన్ ఇండియా చిత్రాల సరసన నిలబడ్డాయి.
మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ తెలుగులోనే విడుదలై రూ. 214 కోట్ల వసూళ్లను సాధించింది. సరిలేరు నీకెవ్వరు రూ. 260 కోట్లు, మహర్షి రూ. 170 కోట్లు, గుంటూరు కారం రూ. 200 కోట్లు, భరత్ అనే నేను రూ. 187 కోట్లు రాబట్టింది. ఒక్క భాషలోనే విడుదల అయితేనే ఇలాంటి కలెక్షన్లతో సత్తా చాటితే అదే పాన్ ఇండియా రేంజ్‌లో రేపొద్దన బొమ్మ పడితే ఎలా ఉంటుందో ఊహకే వదలేయ వచ్చు అని చెప్పవచ్చు.