సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ మూవీ రివ్యూ | M4M Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

M4M Review : అమెరికన్‌ నటించిన ‘ఎం4ఎం’ మూవీ రివ్యూ

May 8 2026 4:25 PM | Updated on May 8 2026 4:31 PM

M4M Movie Review And Rating In Telugu

టైటిల్‌ : ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)
న‌టులు: జో శర్మ, సంబీత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, ఎంఆర్‌సి వడ్లపట్ల, రాజేష్ మాత్రే, గీతా భాస్కర్ త‌దిత‌రులు.
నిర్మాణ సంస్థ: మోహన్ మీడియా క్రియేషన్స్
దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల
సినిమాటోగ్రఫీ: సంతోష్‌ షణ్మోని
విడుదల తేది: మే 8, 2026

మే నెలలో పెద్ద చిత్రాలేవి బరిలో లేకపోవడం..చిన్న చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే గతవారం వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. ఇక ఈ వారం కూడా నాలుగైదు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో సస్పెన్స్ థ్రిల్లర్ ఎం4ఎం కూడా ఒకటి. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
హైదరాబాద్‌లో స్టార్‌ హీరో రంజిత్‌(కృష్ణ తేజ) దారుణ హత్యకు గురవుతాడు. ఓ సీరియల్‌  కిల్లర్ అతన్ని దారుణంగా పొడిచి చంపి ఓ పెయింటింగ్ ఆకారంలో న్యూడ్ గా పెట్టేసి పారిపోతాడు. ఆ కేసుని దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగుతాడు ఏసీపీ కృష్ణ(సంబీత్ ఆచార్య). అతని భార్య రాధ(జో శర్మ) లెజిట్ న్యూస్ అనే మీడియా ఛానల్లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి ఈ హత్యపై తమదైన శైలీలో విచారణ చేస్తుంటారు. కిల్లర్‌ మాత్రం వాళ్లకు చిక్కకుండా వరుస హత్యలు చేస్తుంటాడు. అంతేకాదు ఎక్కడెక్కడ హత్య చేయబోతున్నాడో వాయిస్‌ మెసేజ్‌ ద్వారా పోలీసులకు చెప్పి.. దమ్ముంటే ఆపండంటూ సవాల్‌ విసురుతాడు. మరి ఈ సీరియల్‌ కిల్లరిని కృష్ణ, రాధ ఎలా కనిపెట్టారు? హత్యల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్ కథలన్నీ ఒకేలా ఉంటాయి. ఓ వ్యక్తి హత్యకు గురవడం.. హంతకుడు ఎవరనేది తెలియకపోవడం .. ఆ కేసును చేధించే క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవ్వడం.. చివరిలో అసలు హంతకుడిని పట్టుకోవడం..ఇలానే ఉంటుంది. ఎం4ఎం కథనం కూడా ఇలానే సాగుతుంది.  ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతను హత్యలు చేసిన తర్వాత, ఆ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో లాంటి పెయింటర్ల ఫేమ‌స్ పెయింటింగ్స్ తరహాలో డెకరేట్ చేయడం ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇన్వెస్టిగేషన్‌, ట్విస్టులు అంతా రొటీన్‌గానే సాగుతాయి. ప్రభుత్వం బ్యాన్‌ చేసిన మోటివ్ ఫర్ మర్డర్(ఎం4ఎం) పుస్తకానికి, సీరియల్‌ కిల్లరికి ఉన్న సంబంధం కథలో ఒక కీలక మలుపు.

సూపర్‌ స్టార్‌ రంజిత్‌ హత్య సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఈ కేసు విచారణ ఏసీపీ కృష్ణ చేతికి రావడం.. క్రైమ్‌ రిపోర్టర్‌ రాధ అతనికి సహాయం చేయడం..ఈ క్రమంలో మరో మర్డర్‌ జరగడం.. ఇవన్నీ రొటీన్‌గానే సాగుతాయి. అయితే మృతదేహాలను పెయింటింగ్స్ తరహాలో డెకరేట్ చేయడంతో..ఎందుకలా చేస్తున్నాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఎం4ఎం పుస్తకం గురించి తెలిసిన తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. చివరలో వచ్చే ట్విస్ట్‌లు ఊహించలేరు.  సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే..
అమెరికన్ నటి జో శర్మ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ రాధ పాత్రలో చ‌క్క‌గా నటించింది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, డాన్స్.. ఇలా అన్నింటిలోనూ జో శ‌ర్మ జోరు చూపించింద‌నే చెప్పాలి. ఇక హీరో పాత్ర‌లో సంబీత్ ఆచార్య ఏసీపీ కృష్ణ పాత్రకి న్యాయం చేశాడు. సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణతో పాటు ఇత‌ర న‌టీన‌టులు త‌మ పాత్ర‌ల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వసంత్ ఇసైపెట్టై అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు.  
-రేటింగ్‌ 2.5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement