Jo Sharma
-
సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ మూవీ రివ్యూ
టైటిల్ : ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)నటులు: జో శర్మ, సంబీత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, ఎంఆర్సి వడ్లపట్ల, రాజేష్ మాత్రే, గీతా భాస్కర్ తదితరులు.నిర్మాణ సంస్థ: మోహన్ మీడియా క్రియేషన్స్దర్శకత్వం: మోహన్ వడ్లపట్లసినిమాటోగ్రఫీ: సంతోష్ షణ్మోనివిడుదల తేది: మే 8, 2026మే నెలలో పెద్ద చిత్రాలేవి బరిలో లేకపోవడం..చిన్న చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే గతవారం వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక ఈ వారం కూడా నాలుగైదు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో సస్పెన్స్ థ్రిల్లర్ ఎం4ఎం కూడా ఒకటి. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. హైదరాబాద్‌లో స్టార్ హీరో రంజిత్(కృష్ణ తేజ) దారుణ హత్యకు గురవుతాడు. ఓ సీరియల్ కిల్లర్ అతన్ని దారుణంగా పొడిచి చంపి ఓ పెయింటింగ్ ఆకారంలో న్యూడ్ గా పెట్టేసి పారిపోతాడు. ఆ కేసుని దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగుతాడు ఏసీపీ కృష్ణ(సంబీత్ ఆచార్య). అతని భార్య రాధ(జో శర్మ) లెజిట్ న్యూస్ అనే మీడియా ఛానల్లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి ఈ హత్యపై తమదైన శైలీలో విచారణ చేస్తుంటారు. కిల్లర్ మాత్రం వాళ్లకు చిక్కకుండా వరుస హత్యలు చేస్తుంటాడు. అంతేకాదు ఎక్కడెక్కడ హత్య చేయబోతున్నాడో వాయిస్ మెసేజ్ ద్వారా పోలీసులకు చెప్పి.. దమ్ముంటే ఆపండంటూ సవాల్ విసురుతాడు. మరి ఈ సీరియల్ కిల్లరిని కృష్ణ, రాధ ఎలా కనిపెట్టారు? హత్యల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథలన్నీ ఒకేలా ఉంటాయి. ఓ వ్యక్తి హత్యకు గురవడం.. హంతకుడు ఎవరనేది తెలియకపోవడం .. ఆ కేసును చేధించే క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవ్వడం.. చివరిలో అసలు హంతకుడిని పట్టుకోవడం..ఇలానే ఉంటుంది. ఎం4ఎం కథనం కూడా ఇలానే సాగుతుంది. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతను హత్యలు చేసిన తర్వాత, ఆ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో లాంటి పెయింటర్ల ఫేమస్ పెయింటింగ్స్ తరహాలో డెకరేట్ చేయడం ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇన్వెస్టిగేషన్, ట్విస్టులు అంతా రొటీన్‌గానే సాగుతాయి. ప్రభుత్వం బ్యాన్ చేసిన మోటివ్ ఫర్ మర్డర్(ఎం4ఎం) పుస్తకానికి, సీరియల్ కిల్లరికి ఉన్న సంబంధం కథలో ఒక కీలక మలుపు.సూపర్ స్టార్ రంజిత్ హత్య సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఈ కేసు విచారణ ఏసీపీ కృష్ణ చేతికి రావడం.. క్రైమ్ రిపోర్టర్ రాధ అతనికి సహాయం చేయడం..ఈ క్రమంలో మరో మర్డర్ జరగడం.. ఇవన్నీ రొటీన్‌గానే సాగుతాయి. అయితే మృతదేహాలను పెయింటింగ్స్ తరహాలో డెకరేట్ చేయడంతో..ఎందుకలా చేస్తున్నాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఎం4ఎం పుస్తకం గురించి తెలిసిన తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. చివరలో వచ్చే ట్విస్ట్‌లు ఊహించలేరు. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే..అమెరికన్ నటి జో శర్మ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ రాధ పాత్రలో చక్కగా నటించింది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, డాన్స్.. ఇలా అన్నింటిలోనూ జో శర్మ జోరు చూపించిందనే చెప్పాలి. ఇక హీరో పాత్రలో సంబీత్ ఆచార్య ఏసీపీ కృష్ణ పాత్రకి న్యాయం చేశాడు. సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణతో పాటు ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వసంత్ ఇసైపెట్టై అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు. -రేటింగ్ 2.5/5 -
మా సినిమాను చూసి విదేశీయులు ఆశ్చర్యపోయారు: జో శర్మ
‘‘మా ‘ఎమ్4ఎమ్’ రిలీజ్‌కు ముందే 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు గెల్చుకుంది. గత ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మా సినిమాను గ్లోబల్ ప్రీమియర్ వేశాం. సబ్ టైటిల్స్‌తో మా సినిమాను చూసిన విదేశీయులు ఆశ్యరపోయారు. సినిమా పూర్తయిన తర్వాత స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు’’ అని జో శర్మ చెప్పారు. సంబీత్ ఆచార్య, జో శర్మ లీడ్ రోల్స్‌లో నటించిన సినిమా ‘ఎమ్4ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జో శర్మ మాట్లాడుతూ– ‘‘నేను హైదరాబాద్‌లో పుట్టాను. ముంబై, నాగపూర్‌లో పెరిగాను. ‘ఎమ్4ఎమ్’ కోసం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చాను. అమెరికాలో థియేటర్ ఆర్టిస్ట్‌ని. అక్కడ నాకో థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. అయినా మోహన్గారి దగ్గర మూడేళ్లు శిక్షణ తీసుకుని, ఈ సినిమాలో నటించాను. ఇందులో రాధ అనే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించాను. ఈ సినిమాకి కో –రైటర్‌గానూ చేశాను. దీంతో రాధ పాత్రని నేను మరింత స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దుకునే అవకాశం కలిగింది. ఇక మా సినిమా విడుదలైన రోజున సినిమా పూర్తయ్యే లోపు విలన్ ఎవరో చెబితే లక్ష రూపాయలు బహుమతి ఇస్తాం’’ అని చెప్పారు. -
M4M: కిల్లర్ ఎవరో చెబితే లక్ష రూపాయల నగదు బహుమతి
జో శర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన తారాగణంగా మోహన్ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎమ్ 4 ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకుడు వి. సముద్ర హాజరై, సినిమా హిట్టవ్వాలని కోరారు. ‘‘మా చిత్రానికి ఇప్పటికే 25 దేశాల్లో 50కిపైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’’ అన్నారు జో శర్మ. ‘‘ఈ మూవీలోని సీరియల్ కిల్లర్ ఎవరో ముందుగా చెప్పిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఉంటుంది’’ అన్నారు మోహన్ వడ్లపట్ల. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఎమ్4 ఎమ్’
అమెరికన్ నటి జో శర్మ, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఎమ్4 ఎమ్: మోటివ్ ఫర్ మర్డర్’. మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై ఎమ్సీ విన్ గ్రూప్ యూఎస్ఏ సహకారంతో మోహన్ వడ్లపట్ల నిర్మించిన ఈ సినిమా మే 8న రిలీజ్ కానుంది. ‘‘మా సినిమాను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడాన్ని మేం గర్వంగా ఫీలవుతున్నాం.అలాగే ముంబైలో ప్రీమియర్ షో ప్రదర్శించగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. అదేవిధంగా అమెరికాలో టెక్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ మా మూవీని విడుదల చేస్తోంది. మర్డర్ మిస్టరీగా రూపొందిన మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. -
Cannes 2025 : కేన్స్‌లో టాలీవుడ్ సినిమాకు అరుదైన ఘనత
2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓ తెలుగు సినిమా మన ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. మోహన్ వడ్లపట్ల, జో శర్మ మూవీ ‘ఎం4ఎం’ (M4M - Motive for Murder). కేన్స్‌లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్లో ‘ఎం4ఎం’ మూవీ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.తెలుగు చిత్రసీమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్లతో పాటు అమెరికాకు చెందిన నటి జో శర్మ గౌరవంగా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు హర్షధ్వానాలు చేయడంతో పాటు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇది తెలుగు సినిమాకు కేన్స్‌లో దక్కిన అరుదైన ఘనత.ఇటీవల అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందుతున్న జో శర్మ, ఈ ఈవెంట్లో దుబాయ్, ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, నటనా ప్రతిభకు అక్కడి మీడియా ప్రశంసలు కురిపించింది.మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన M4M, కేన్స్ 2025లో ప్రదర్శించిన ఏకైక తెలుగు చిత్రం. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథన బలంతో పాటు సినిమాటిక్ ప్రెజెంటేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సహా ప్రపంచ సినీ పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు హాజరై చిత్రానికి అభినందనలు తెలిపారు.గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకు కేన్స్‌లో ఊరిస్తున్న ఈ అరుదైన గౌరవం, M4M మూవీకి దక్కడంతో ఈ ప్రీమియర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో గొప్ప ఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాతగా మంచి గుర్తింపు ఉన్న మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జో శర్మ అభినయం ప్రపంచ స్థాయిలో ప్రశంసలందుకుంది.త్వరలో ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. భారతీయ ప్రాంతీయ సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన సినిమాగా M4M విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంటోంది.


