సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అంతా అందంగానే కనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరు స్టార్ అవుతారు..ఎవరు జీరో అవుతారో ఊహించలేం.డబ్బు, ఫేమ్ ఎలా వస్తుందో, ఎలా పోతుందో ఎవరూ అంచనా వేయలేం. స్టార్ అవ్వడానికి ఎంత కష్టపడాలో ఆ స్టార్‌డమ్‌ని కాపాడుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. ఒక చిన్నతప్పు చాలు ‘స్టార్’ని కాస్త జీరో చేయడానికి. ఉన్న ఫేమ్ పోయిన తర్వాత మళ్లీ తిరిగి తెచ్చుకోవడం కష్టం. రాలేదు కూడా. అలా ఓ వ్యక్తి తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది.. ఈగోతో గొడవలకు పోయి ఉన్న పేరుని కాస్త చెడగొట్టుకోవడమే కాదు.. హత్య కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు.అంతేకాదు 49 ఏళ్లకే తన జీవితానికి ‘శుభం’ కార్డు వేసుకున్నాడు. ఆయనే ఎంకే త్యాగరాజ భాగవతార్ అలియాస్ ఎంకేటీ.
14 సినిమాల్లో 10 బ్లాక్ బస్టర్స్
ఈ తరం ప్రేక్షకులకు ఎంకే త్యాగరాజ భాగవతార్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒకప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్. ఆయన నటించిన 14 చిత్రాలలో 10 సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి.ఆయన నటించిన హరిదాస్ వంద వారాలకు పైగా ఆడిందట. ఎంకే త్యాగరాజ భాగవతార్ పూర్తి పేరు మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్. అభిమానులు ముద్దుగా ఎంకేటీ అని పిలుస్తారు. 1910లో పుట్టిన త్యాగరాజన్‌ది పేద కుటుంబం. కర్ణాటక సంగీత గాయకుడుగా పేరు సంపాదించింది తర్వాత సినిమాల్లోకి వచ్చాడు.1934-59 మధ్యకాలంలో 14 సినిమాల్లో హీరోగా నటిస్తే.. అందులో 10 భారీ విజయం సాధించాయి. దీంతో ఆయనకు సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చింది. 1940 ప్రాంతంలోనే మెర్సీడెస్ బెంజ్‌లో తిరగడమే కాక.. బంగారు పళ్లేల్లో భోజనం చేసేవాడట.
హత్యకేసులో జైలుకు..
స్టార్ హీరోగా మారిన తర్వాత ఎంకేటీ ప్రవర్తలో మార్పు వచ్చింది. ఓ ప్రముఖ దర్శకుడితో వివాదం ఎంకేటీ జీవితాన్ని తలకిందులు చేసిందట. ఈగోతో ఆ దర్శకుడితో గొడవపడడంతో తర్వాత అవకాశాలు తగ్గిపోయాయట. ఆ సమయంలోనే జరిగిన ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ఆయనను ఇరికించడంతో రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అవకాశాలు రాలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన అవకాశాల కోసం చాలా ప్రయత్నాలే చేశాడట. చివరకు అనారోగ్య భారిన పడి 1959 నవంబర్ 1వ 49 ఏళ్లకే కన్నుమూశారు.
‘కాంత’ ఈ హీరో కథేనా?
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంతా’. రానా దగ్గుబాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే..ఇది ఎంకేటీ బయోపిక్‌లాగే అనిపిస్తుంది. ఇందులో ఎంకేటీ పాత్రలో దుల్కర్ నటించగా.. ఆయన పతనానికి కారణం అయిన దర్శకుడి పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇది ఎంకేటీ బయోపిక్ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.


