హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ఆఫీస్‌లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు.. ఈ నాలుగు విభాగాల కౌన్సిల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు దీని ఫలితాలు బయటకు వచ్చేశాయి.
ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీపడ్డాయి. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు బలపరుస్తున్న 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఒకవైపు.. సి. కల్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న 'మన ప్యానెల్' మరోవైపు రేసులో నిలిచాయి. చివరకు ప్రొగ్రెసివ్ ప్యానెల్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు.
నిర్మాతల సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు, మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు. స్టూడియో సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు, మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది, మన ప్యానెల్ నుంచి ఇద్దరు గెలిచారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది, మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించగా ఒకటి టై అయింది. ఓవరాల్‌గా 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31 మంది, మన ప్యానెల్ లో 17 మంది గెలిచారు. తద్వారా ఫిలిం ఛాంబర్ ఎలక్షన్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది.
ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. కార్యవర్గ పదవీకాలం ఈ ఏడాది జూలైలోనే ముగిసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. వీళ్లంతా 2027 జూలై వరకు పదవుల్లో కొనసాగనున్నారు. ఇప్పుడు ఎవరికి ఏ పదవి అనేది నిర్ణయించారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేశ్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా నాగవంశీ, సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్ ఎన్నికవగా.. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా భరత్ చౌదరి, స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా కిరణ్ ఎన్నికయ్యారు.


