మెగాఫోన్ ప‌డుతున్న మ‌న హీరోలు! | Indian Actors turned filmmakers When stars Take The Director Chair | Sakshi
Sakshi News home page

యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్‌, ప్రొడ‌క్ష‌న్‌

Jun 17 2026 5:03 PM | Updated on Jun 17 2026 5:58 PM

Indian Actors turned filmmakers When stars Take The Director Chair

తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమల్లో మల్టీ టాలెంటెడ్‌ అనే పదం ఈ మధ్య బాగా వినిపిస్తోంది. గతంలో కేవలం నటనకే పరిమితం అయ్యేవారు హీరోలు, హీరోయిన్లు. అయితే ఇప్పటి హీరోలు కేవలం నటనకి మాత్రమే పరిమితం కావడం లేదు. యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్‌ కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరేమో తమ సినిమాలకు తామే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సరైన హిట్స్‌ లేనప్పుడు తమకు సరిపడా కథలను రాసుకుని హిట్‌ అందుకున్న హీరోలూ ఉన్నారు. మరికొందరేమో స్వీయ కథని సిద్ధం చేసుకోవడంతో పాటు తామే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించి, హిట్స్‌ అందుకున్నారు కూడా.

అయితే ఇటీవల ఎక్కువ మంది హీరోలు తమని తాము నిలబెట్టుకోవడానికి సొంత నిర్మాణ సంస్థలు స్థాపించి నిర్మాతలుగా మారారు కూడా. సొంత ప్రొడక్షన్‌ హౌస్‌లు నెలకొల్పిన వారిలో కొందరు హీరోయిన్లు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం పలువురు హీరోలుగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తుండగా, మరికొంత మంది స్వీయ నిర్మాణంలో హీరోలుగా నటిస్తున్నారు. ఈ లిస్ట్‌లో తెలుగులో అక్కినేని నాగార్జున, రామ్ పోతినేని, వడ్డే నవీన్, విశ్వక్‌ సేన్, కిరణ్‌ అబ్బవరం వంటి హీరోలతో పాటు హీరోయిన్‌ సమంత ఉన్నారు. ఇక కన్నడ నుంచి యశ్, తమిళ్‌ నుంచి విశాల్, బాలీవుడ్‌ నుంచి హృతిక్‌ రోషన్‌ వంటి కథానాయకులు కూడా ఉన్నారు. ఇలా ఆన్‌ సెట్‌ ఆర్టిస్టులుగా ఆఫ్‌ సెట్‌ దర్శకులుగా నిర్మాతలుగా బిజీగా ఉన్న స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

నూరవ చిత్రానికి నిర్మాతగానూ... 
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘విక్రమ్‌’ (1986) సినిమాతో హీరోగా పరిచయమై, నలభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వర రావు తన సతీమణి అన్నపూర్ణ పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్‌ అనే బ్యానర్‌ను నెలకొల్పి పలు సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్‌పై నాగార్జున కూడా ఎన్నో చిత్రాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వర రావు మరణానంతరం కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌పై తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు నాగార్జున.

తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న వందో చిత్రాన్ని కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌పైనే నిర్మిస్తున్నారు. ఆయన ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు రా. కార్తీక్‌ తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున కెరీర్‌లో ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట కార్తీక్‌. హాలీవుడ్‌ చిత్రాల్లో వాడే ‘డి–ఏజింగ్‌’ సాంకేతికతను ఈ సినిమా కోసం వాడుతుండటం విశేషం. దీని సాయంతో నాగార్జునను వెండితెరపై 25 ఏళ్ల యువకుడిగా చూపించబోతున్నారు దర్శకుడు.

ఈ మూవీలో నాగార్జునతో కలిసి నటిస్తున్నారు టబు. ‘నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే, సిసింద్రీ’ (స్పెషల్‌ సాంగ్‌) వంటి సినిమాల తర్వాత నాగార్జున–టబు కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ మూవీలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్‌ అతిథి పాత్రల్లో సర్‌ప్రైజ్‌ చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకి ‘కింగ్‌ 100, కింగ్‌ 100 నాటౌట్‌’ వంటి టైటిల్స్‌ను మేకర్స్‌ అనుకుంటున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 

ముచ్చటగా మూడోసారి...  
హీరో విశ్వక్‌ సేన్‌ ముచ్చటగా మూడోసారి మెగాఫోన్‌ పట్టారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఫలక్‌నూమా దాస్‌’. ఈ మూవీకి కథ అందించడంతో పాటు హీరోగా నటించారు విశ్వక్‌ సేన్‌. ఈ చిత్రాన్ని ఆయన తండ్రి కరాటే రాజు నిర్మించారు. 2019 మే 31న విడుదలైన ఈ మూవీ హిట్‌ అందుకుంది. డైరెక్టర్‌గా తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు విశ్వక్‌ సేన్‌. ఆ తర్వాత హీరోగా బిజీ అయిన ఆయన దర్శకత్వం వహించిన ద్వితీయ చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. ఈ చిత్రాన్ని కూడా ఆయన తండ్రి కరాటే రాజు నిర్మించారు. 2023 మార్చి 22న విడుదలైన ఈ చిత్రం విజయం అందుకుంది. అనంతరం కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన విశ్వక్‌ ముచ్చటగా మూడోసారి దర్శకత్వం చేపట్టారు. ఆయన హీరోగా నటించి, స్వీయ రచన, దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కల్ట్‌’. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్‌ భాస్కర్‌ ఇతర ΄ాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కల్ట్‌’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్‌ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపి కొట్టి ‘కల్ట్‌’ సినిమా తీశాను. ‘ఫలక్‌నూమా దాస్‌’ మూవీ తీయకముందు నాలో ఒక కసి, ఆకలి ఉండేది. ‘కల్ట్‌’ తీసే ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను’’ అని పేర్కొన్నారు. తారక్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సందీప్‌ కాకరాల నిర్మించిన ‘కల్ట్‌’ సినిమా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్‌ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది.  

హీరోగా, నిర్మాతగా రీ ఎంట్రీ  
‘పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్‌ (Vadde Naveen) ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ఎటాక్‌’. 2016 ఏప్రిల్‌ 1న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత సుమారు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న వడ్డే నవీన్‌ ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’ చిత్రంతో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాని ఆయనే స్వయంగా నిర్మించడం విశేషం. ఈ మూవీ ద్వారా కమల్‌ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో శిల్పా తులస్కర్, వివేక్‌ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవీ ప్రసాద్, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్‌పై వడ్డే నవీన్‌ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది.

‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’ నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. వినోదాత్మకంగా, భావోద్వేగాలతో ఉండే ఈ చిత్రం వడ్డే నవీన్‌ నటనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతుందంటూ యూనిట్‌ పేర్కొంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వడ్డే నవీన్‌ మాట్లాడుతూ– ‘‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’ సినిమాని టీం అంతా ఇష్టపడి చేశారు. ఈ పదేళ్లలో టెక్నికల్‌ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మూవీలో కోర్ట్‌ డ్రామాతో పాటు సస్పెన్స్‌ బాగుంటుంది. ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలానే చూసుకున్నాం. ఇందులోని కంటెంట్‌ బలంగా ఉంటుంది. మా సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.  

బంగారంతో మళ్లీ నిర్మాతగా... 
‘ఏమాయ చేసావె’ (2010) సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అయ్యారు సమంత. తొలి మూవీతోనే హిట్‌ అందుకుని, యువతలో ప్రత్యేకమైన క్రేజ్‌ సొంతం చేసుకున్నారామె. ఆ తర్వాత తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగారు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సమంత ‘శుభం’ సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ అనే బ్యానర్‌ని నెలకొల్పిన ఆమె తొలి చిత్రంగా ‘శుభం’ మూవీని నిర్మించారు. 2025 మే 9న విడుదలఅయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. తొలి చిత్రంతోనే సక్సెస్‌ అందుకున్న సమంత నిర్మించిన ద్వితీయ చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీలో సమంత ప్రధాన పాత్రలో నటించారు.

‘ఓ బేబి’ వంటి హిట్‌ మూవీ తర్వాత సమంత, డైరెక్టర్‌ నందినీ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘మా ఇంటి బంగారం’. దిగంత్, గుల్షన్‌ దేవయ్య, గౌతమి, మంజుషా, శ్రీముఖి ముఖ్య పాత్రలు పోషించారు. ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రాజ్‌ నిడిమోరు(సమంత భర్త), హిమాంక్‌ దువ్వూరుతో కలిసి సమంత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌తో రూపొందిన ఈ మూవీ నుంచి విడుదలైన లుక్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ–‘‘మా ఇంటి బంగారం’ ట్రైలర్‌ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. నందినీగారు, రాజ్‌ గారు ప్రతి విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో ఎమోషన్, యాక్షన్, డ్రామా, కామెడీ... ఇలా అన్ని వాణిజ్య అంశాలుంటాయి. అందరూ చూసి ఎంజాయ్‌ చేస్తారు. ప్రత్యేకించి నా అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు.  

నిర్మాతగా తొలి అడుగు 
‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’ (2018), ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ (2022) సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో యశ్‌. ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత యశ్‌ హీరోగా నటించిన తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో యశ్‌ హీరోగా నటించడంతో పాటు నిర్మించడం విశేషం. నయనతార, కియారా అద్వానీ,  హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రలు పోషించారు. కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కేవీఎన్ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్ పతాకంపై వెంకట్‌ కె. నారాయణ, యశ్‌ ఈ మూవీ నిర్మించారు. ఈ మూవీని ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌లో మార్చి 19న రిలీజ్‌ చేయనున్నట్లు తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మార్చి నుంచి జూన్‌ 4కి రిలీజ్ పోస్ట్‌పోన్‌ అయినప్పటికీ మరోసారి వాయిదా పడింది. అయితే కొత్త విడుదల తేదీ ఎప్పుడన్నది మాత్రం మేకర్స్‌ ప్రకటించలేదు.

‘‘సినిమాకాన్‌లో ‘టాక్సిక్‌’ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత అక్కడ వచ్చిన స్పందన చూశాక వరల్డ్‌ వైడ్‌గా అందరికీ చేరాల్సిన సినిమా అని మాకు అర్థమైంది. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీ, భాగస్వామ్యులను కాంటాక్ట్‌ అవుతున్నాం. ఈ నేపథ్యంలో జూన్‌ 4న విడుదల చేయలేకపోతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన మరో విడుదల తేదీని త్వరలోనే చెబుతాం’’ అని యశ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘టాక్సిక్‌’ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత ‘దిల్‌’ రాజు సొంతం చేసుకున్నారు.  

తొలిసారి దర్శకత్వం... 
హీరో విశాల్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనదైన నటన, వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. ఇప్పటివరకూ హీరోగా ఆడియన్స్‌ని మెప్పించిన ఆయన తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మకుటం’. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో ఆర్‌.బి. చౌదరి నిర్మించిన 99వ సినిమా ‘మకుటం’. బుధవారం విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌ సినిమాపై క్రేజ్‌ని పెంచింది. ‘‘స్టైలిష్, విజువల్‌ ట్రీట్‌లా ‘మకుటం’ మూవీని తెరకెక్కించారు. విశాల్‌ త్రిపాత్రాభినయం, స్టైలిష్‌ దర్శకత్వం, ఆకట్టుకునే సాంకేతిక నైపుణ్యం, ఆసక్తికరమైన కథనం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఆయన కెరీర్‌లోనే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. 

విశాల్‌ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్‌ చేసిన తొలి ప్రాజెక్ట్‌ ఇదే కావడంతో ఇండస్ట్రీ వర్గాలో భారీ అంచనాలున్నాయి. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటివరకు రిలీజ్‌ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ దక్కింది. జూలైలో మా సినిమా విడుదల కానుంది’’ అని యూనిట్‌ ప్రకటించింది.   పైన పేర్కొన్న హీరోలు మాత్రమే కాదు.. మరికొంత మంది హీరోలు, హీరోయిన్లు కూడా నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు.  

తొలిసారి మెగాఫోన్‌తో... 
‘దేవదాసు’ (2006) సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రామ్ పోతినేని. వైవీఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ద్వారా హీరోయిన్‌ ఇలియానా కూడా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే తనదైన డ్యాన్సులు, నటనతో హిట్‌ అందుకున్నారు రామ్‌. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా రెండు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆయన తొలిసారి మెగాఫోన్‌ పడుతున్నారు. ఈ సినిమా కోసం సొంతంగా కథ రాసుకున్నారు. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు తానే దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాతగా మారారు. రాపో సినిమాటిక్స్‌ బ్యానర్‌పై రూపొందనున్న ‘ర్యాపో 23’ మూవీని రామ్‌ బర్త్‌డే సందర్భంగా మే 15న ప్రకటిస్తూ.. ఈ చిత్రంలో రామ్ పోషించనున్న వీర పాత్రని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘‘రామ్ పోతినేని తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేయబోతున్నారు.

నటుడిగా తన వైవిధ్యాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చిన ఆయన ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ సినిమాతో తొలిసారి లిరిసిస్ట్‌గా మారి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు.. గాయకుడిగానూ తన వాయిస్‌ని వినిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తన 23వ చిత్రం ‘ర్యాపో 23’తో దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. స్టైలిష్‌ సైకాలజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. వీర పాత్రలో రామ్‌ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ నెలలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభించి, డిసెంబర్‌లో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట.

డైరెక్టర్‌గానూ... 
‘రాజావారు రాణిగారు’ (2019) సినిమా ద్వారా తెలుగులో హీరోగా పరిచయం అయ్యారు కిరణ్‌ అబ్బవరం. ఆయన హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’. ఈ సినిమాకి కథ అందించడంతో పాటు స్క్రీన్‌ప్లే అందించారు కిరణ్‌. 2021 ఆగస్టు 6న విడుదలైన ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ (2022) సినిమాకి కథ అందించారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే కేఏ ప్రొడక్షన్స్‌ అనే బ్యానర్‌ని స్థాపించి, ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమా నిర్మించారు కిరణ్‌. ఈ ఏప్రిల్‌ 17న ఈ మూవీ రిలీజ్‌ అయింది. ఇప్పుడు తన కెరీర్‌లో తొలిసారి మెగా ఫోన్‌ పట్టారు కిరణ్‌. ఆయన హీరోగా, కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు.

జాయ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చాగంటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 12న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో దేవికా భట్‌ తెలుగు తెరకు హీరోయిన్‌ గా పరిచయం అవుతున్నారు. శరత్‌ కుమార్, సాయి కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమా ఇది. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించే ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు కిరణ్‌. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ కథను సిద్ధం చేశారు. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలతో పాటు తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారాయన. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం అయింది. తొలి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది’’ అని మేకర్స్‌ తెలిపారు. 

హీరోగానే కాదు... దర్శకుడిగానూ... 
హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన ‘క్రిష్‌’ చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా ఆయన తండ్రి రాకేష్‌ రోషన్‌ దర్శకత్వం వహించిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కోయి మిల్‌ గయా’. 2003 ఆగస్టు 8న రిలీజైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘క్రిష్‌’. రాకేష్‌ రోషన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలోనూ హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించారు. 2006 జూన్‌ 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో రూపొందిన మరో చిత్రం ‘క్రిష్‌ 3’. రాకేష్‌ రోషన్‌– హృతిక్‌ రోషన్‌  కాంబినేషన్‌లోనే తెరకెక్కిన ఈ చిత్రం 2013 నవంబరు 1న రిలీజై, హిట్‌ అందుకుంది.

ఈ ఫ్రాంచైజీలో రానున్న తాజా చిత్రం ‘క్రిష్‌ 4’. ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు హృతిక్‌ రోషన్‌. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి మూడు సినిమాలకు తండ్రి రాకేష్‌ రోషన్‌ దర్శకత్వం వహించగా ‘క్రిష్‌ 4’కి మాత్రం హృతిక్‌ రోషన్‌ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇందులో ఆయన హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనుండటం విశేషం. ‘క్రిష్‌ 4’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్‌ లాక్‌ అయిన ‘క్రిష్‌ 4’ ఈ ఏడాదిలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. 2027లో ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట హృతిక్‌ రోషన్‌.   

– డేరంగుల జగన్‌ మోహన్‌   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement