శోభు యార్లగడ్డ, కార్తికేయ, ఫాహద్ ఫాజిల్, బేబీ సారా, శశాంక్ యేలేటి
‘‘తెలుగు వారి నుంచి నాకు ఇంత ప్రేమ వస్తుందని, ప్రత్యేకించి హైదరాబాద్‌లో నాపై ఇంతటి ప్రేమ దొరకుతుందనుకోలేదు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కార్తికేయ, శోభుగారు గొప్ప నిర్మాతలు. ఈ చిత్రం నాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడండి.. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అని ఫాహద్ ఫాజిల్ చెప్పారు.
శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్‌దేవ్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్‌ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన ఈ సినిమాని అక్టోబరు 2న రిలీజ్ అవుతోంది.
మంగళవారం నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు శశాంక్ యేలేటి మాట్లాడుతూ– ‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. మా మూవీ చాలా కొత్తగా ఉంటుంది’’ అని తెలిపారు. శోభు యార్లగడ్డ మాట్లాడుతూ– ‘‘ఫాహద్‌ని తెలుగులో హీరోగా పరిచయం చేస్తుండటం హ్యాపీ. అలాగే శశాంక్‌ని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.
సారాని చూసి అందరూ సర్‌ప్రైజ్ అవుతారు’’ అని పేర్కొన్నారు. ‘‘శోభుగారితో ప్రయాణం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. మా సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ఎస్‌ఎస్ కార్తికేయ తెలిపారు. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వచ్చి మా మూవీ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు బేబి సారా.


