ఆదిత్య హాసన్, వైష్ణవీ చైతన్య, రష్మిక మందన్నా, ఆనంద్ దేవరకొండ
‘‘ఎపిక్’ ట్రైలర్ చాలా నచ్చింది. మంచి రొమాంటిక్, కామెడీ వైబ్‌లో ఉంది. ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. ఈ నెల 11న మీతో (ప్రేక్షకులతో), యూనిట్‌తో కలిసి ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ నెల 10న ప్రీమియర్స్ వేస్తున్నారు... చూసి ఎంజాయ్ చేయండి’’ అని రష్మిక మందన్నా పేర్కొన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘ఎపిక్–ఫస్ట్ సెమిస్టర్’.
ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. శుక్రవారం నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ– ‘‘ఎపిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వస్తారా? అని ఆనంద్ మెసేజ్ చేశాడు. ‘రణబాలి’ షూట్‌లో హైదరాబాద్‌లో ఉన్నాను. తప్పకుండా వస్తానని, వచ్చేశాను. ఆనంద్ చాలా కష్టపడతాడు. తన సినిమాలు బాగా ఆడాలి, మంచి వసూళ్లు రావాలి. వైష్ణవి కోసం అద్భుతమైన పాత్రలు రాస్తుండటం గొప్ప విషయం.
ఆదిత్య హాసన్ ఈ మూవీని అద్భుతంగా తీశారనిపిస్తోంది’’ అని తెలిపారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘వదినమ్మతో (రష్మిక) ఇంట్లో ఎక్కువగా మాట్లాడను. కానీ, ‘ఎపిక్’ ప్రమోషన్స్ గురించి నన్ను అడిగి మరీ తెలుసుకుని సపోర్ట్ చేశారు. విజయ్‌లాంటి అన్నయ్య, రష్మికలాంటి వదినమ్మ ఉన్నందుకు అదృష్టవంతుణ్ణి. ‘ఎపిక్’ భావోద్వేగమైన, అందమైన సినిమా’’ అని చెప్పారు.


