సినీ సెప్టెంబర్‌ | Upcoming Movie Release in September 2026: Tollywood | Sakshi
Sakshi News home page

సినీ సెప్టెంబర్‌

Sep 2 2026 4:03 AM | Updated on Sep 2 2026 4:03 AM

Upcoming Movie Release in September 2026: Tollywood

ఈ నెలలో వరుస సినిమాల విడుదల 

అనువాద చిత్రాలు అరడజను వరకూ...

ఆగస్టులో విడుదలైన రవితేజ ‘ఇరుముడి’ సినిమా బ్లాక్‌బస్టర్‌ తో సినిమా ఇండస్ట్రీకి మరింత ఊపిరి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్‌ థియేటర్స్‌కు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. ఇది తెలుగు బాక్సాఫీస్‌కు మరింత ఊపునిచ్చింది. తాజాగా సెప్టెంబరులో కూడా ప్రతి వారం తెలుగు బాక్సాఫీస్‌ వద్ద ఓ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఆశ్చర్యకరంగా స్ట్రయిట్‌ చిత్రాలతో పాటు సెప్టెంబరులో ప్రతివారం తెలుగు బాక్సాఫీస్‌ వద్ద ఓ డబ్బింగ్‌ సినిమా కూడా ఉంది. లవ్, యాక్షన్, డివోషన్, ఎమోషన్, యూత్‌ఫుల్‌... ఇలా డిఫరెంట్‌ జానర్స్‌లో సెప్టెంబరులో సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. మరి... ఏ వారం ఏయే సినిమా రిలీజ్‌ కానుందో, ఏ డబ్బింగ్‌ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఓ లుక్‌ వేయండి.

రంభ... ఊర్వశి... మేనక భూలోకానికి వస్తే! 
సినిమా హీరో అవ్వాలన్నది సూరి ఆశయం. కానీ సూరి ఏ మాత్రం కష్టపడకుండా సినిమా హీరో అవ్వాలనుకుంటాడు. షార్ట్‌కట్‌ లో తాను హీరో కావాలనుకునే ప్రయత్నంలో భాగంగా ఓ మాయా పుస్తకం సాయంతో ఏకంగా రంభ... ఊర్వశి... మేనకలను భూలోకానికి తీసుకువస్తాడట సూరి.  మరి... ఆ తర్వాత ఏం జరిగింది? సూరి ఆశయం నెరవేరి అతను సినిమా హీరో అయ్యాడా? ‘రంభ... ఊర్వశి... మేనక డ్రామా కంపెనీ’ సూరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది... అనేది ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాలో చూడొచ్చు. 

అల్లరి నరేశ్, సురభి హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, నరేష్‌ వీకే, శ్రీనివాస్‌ రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రమోహన్‌ చింతాడ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్‌ పతాకాలపై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబరు 4న  రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ గతంలో ప్రకటించారు. 

ప్రేమ... హాస్యం... ఉత్కంఠ 
‘అర్జున్‌ రెడ్డి, యానిమల్‌’ సినిమాల్లో మంచి ఇంటెన్స్‌ అండ్‌ బోల్డ్‌ సీన్స్, స్ట్రాంగ్‌ ఎమోషన్స్, యాక్షన్‌ అంశాలను ఆడియన్స్‌ చూశారు. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది సందీప్‌ రెడ్డి వంగా అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆయన ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘రోమాంచకం’ సినిమా మాత్రం ఎక్కువగా ఫన్‌ ఎలిమెంట్స్‌తో రూపొందడం విశేషం. సుమంత్‌ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్‌ హీరో హీరోయిన్లుగా నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రోమాంచకం’. వేణుగోపాల్‌ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

 ప్రేమ, హాస్యం, ఉత్కంఠ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఈ యూత్‌ఫుల్‌ సినిమాకు సందీప్‌ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరించగా, ఆయన సోదరుడు ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించారు. ‘‘కాలేజీ స్టడీస్‌ పూర్తయిన తర్వాత కొంతమంది యువత లో కొంత కన్‌ఫ్యూజన్‌ నెలకొంటుంది. సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేని విభిన్నమైన పరిస్థితుల్లో ఉంటారు. ఈ కాంప్లిసిటీ నేపథ్యంలో ‘రోమాంచకం’ సినిమా కథనం సాగుతుంది’’ అని ఇటీవల వేణుగోపాల్‌ రెడ్డి చెప్పారు. ఈ గురువారం ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. అయితే ఒకరోజు ముందుగానే అంటే... నేడే ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శించనున్నట్లు సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పేర్కొన్నారు. 

లైఫ్‌ ఆఫ్‌ సంజు 
ప్రేమ, అనుబంధాలు, జ్ఞాపకాలు, జీవితంలో ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఎమోషనల్‌ డ్రామా ‘సహా’ (లైఫ్‌ ఆఫ్‌ సంజు). శివకుమార్‌ కాసారం, శ్వేతా లక్ష్మణ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నిశాంత్‌ కోదాటి దర్శకత్వంలో సుమైరా స్టూడియోస్‌ బ్యానర్‌పై తేజ వేల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న రిలీజ్‌ కానుంది. 

‘‘సంజు జీవితంలోని వివిధ దశలను ఈ సినిమా ప్రజెంట్‌ చేస్తుంది. ప్రేమ, విడిపోవడం, మధురమైన జ్ఞాపకాలు, కష్టాలను అధిగమించేందుకు అవసరమైన మనోధైర్యం వంటి అంశాలను కథలో చూపిస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. వ్రజనా పాండ్యా, మహిపాల్, అప్పాజీ, భారతి, మేఘన సునీల్, బాంబే పద్మ, కొండారెడ్డి, హర్షవర్ధన్‌ తదితరులు ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌ 
సాయికుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర, వరుణ్‌ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధర్మస్థల నియోజక వర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబరు 4న రిలీజ్‌ కానుంది. పీవీఆర్‌ సినిమాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారట మేకర్స్‌. అవినీతి, డ్రగ్‌ మాఫియాలపై ఓ సామాన్యుడు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. నటి కస్తూరి ఈ సినిమాలో ఓ విలన్‌ రోల్‌ చేశారని టాక్‌. 

వారాహి అమ్మవారి శాపం ఎందుకు? 
సుమంత్‌ హీరోగా నటించిన ఆధ్యాతి్మక మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఐశ్వర్య రాజేష్, సిద్దు జొన్నలగడ్డ, మీనాక్షి గోస్వామి, మాల్విక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్‌ కనకాల, అలీ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో లక్ష్మణ్, కాలిపు మధు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 11న విడుదల కానుంది. దాదాపు 150 ఏళ్లుగా మహేంద్రగిరి రాజకుటుంబానికి చెందినవారు వరుసగా మరణిస్తుంటారు. ఈ మరణాలన్నీ వారాహి మాత శాపం కారణంగానే జరుగుతున్నాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఈ శాపాన్ని ఛేదించి, వరుస మరణాల వెనక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునేందుకు హీరో ఎలాంటి సాహసాలు చేశాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది.

మధ్యతరగతి  జీవితాలు 
‘బేబీ’ వంటి సూపర్‌హిట్‌ మూవీ తర్వాత హీరో ఆనంద్‌ దేవరకొండ, హీరోయిన్‌ వైష్ణవీ చైతన్య జంటగా నటించిన యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌’. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 11న విడుదల కానుంది. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. మధ్య తరగతి యువతీయువకులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ పడే కష్టాలు, వారి కుటుంబాల ఇబ్బందులు ... వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. అలాగే లవ్, ఎమోషన్‌ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. 

విలేజ్‌ యాక్షన్‌ డ్రామా 
నటుడు–నిర్మాత రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. ఈ విలేజ్‌ యాక్షన్‌ డ్రామా సినిమాకు మంచాల నాగరాజ్‌ దర్శకత్వం వహించగా, దీపా బాలు హీరోయిన్‌గా నటించారు. వినోద్‌ కుమార్, వికాస్‌ వశిష్ట, దయానంద్‌ రెడ్డి, వీఎస్‌ రూపాలక్ష్మి ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. మయూర్‌ రెడ్డి బండారు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది. తెలంగాణలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల 
ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఓ గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి. దీంతో ఆ ఊరి గ్రామదేవతకు ఓ ఆంబోతును 
సమరి్పస్తారు గ్రామస్థులు. కానీ సడన్‌గా, అది అదృశ్యం అవుతుంది. మరి... ఆ తర్వాత ఏం జరిగింది..? అన్నదే ఈ సినిమా కథనం అని సమాచారం.  

ప్రేమకథ 
వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లు గా నటించిన లవ్‌స్టోరీ సినిమా ‘కాగితం పడవలు’. ఎంజీఆర్‌ తుకారాం దర్శకత్వం లో కీర్తన నరేష్, టీఆర్‌ ప్రసాద్‌రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఈ సెపె్టంబరు 18న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇటీవల ప్రకటించారు. ‘‘మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. మా సినిమా చూస్తే మీ ప్రేమకథ గుర్తుకు వస్తుంది’’ అని ఈ సినిమా గురించి దర్శకుడు ఎంజీఆర్‌ తుకారాం చెప్పారు. 

స్పై డ్రామా 
నిహాల్‌ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా నటించిన స్పై డ్రామా ‘సీక్రెట్‌ సోల్జర్‌’. మూన్‌ లైట్‌ డ్రీమ్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో కమల్‌ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్‌ వడ్లమాని  కీలక పాత్రలు పోషించారు. దేశభక్తి, యాక్షన్, థ్రిల్, స్పై యాక్షన్‌ డ్రామా, హ్యూమర్‌ వంటి అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమాని సెప్టెంబరు 18న విడుదల చేయనున్నట్లు ఇటీవల యూనిట్‌ ప్రకటించింది. 

జడల్‌ జమానా 
నాని హీరోగా నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘దిప్యారడైజ్‌’. ఈ చిత్రంలో సికింద్రాబాద్‌ కుర్రాడు జడల్‌ పాత్రలో నాని కపిస్తారు. ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్రలో కయాదు లోహర్‌ నటించగా, మోహన్‌ బాబు, రాఘవ్‌ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని ‘ఏష నాగుల గట్టుపైన..’ అనే స్పెషల్‌ సాంగ్‌లో కీర్తీ సురేష్‌ డ్యాన్స్‌ చేశారు. ‘దసరా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నానితో దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తీసిన సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొని ఉంది. ‘దిప్యారడైజ్‌’ సినిమాలో రా అండ్‌ రస్టిక్‌ యాక్షన్‌ సీక్వెన్స్ లతో పాటు ఎమోషన్స్‌ కు కూడా పెద్ద పీట వేశారట దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. ఐడెంటిటీ, ఆధిపత్య పోరు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబరు 24న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

వీటితో పాటు మరికొన్ని సినిమాలు సెప్టెంబరు నెలలో రిలీజ్‌ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఈ సెప్టెంబరు నెలలో వారానికొక డబ్బింగ్‌ సినిమా కూడా తెలుగు తెరకు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా ‘ఐయామ్‌ గేమ్‌’. నహాస్‌ హిదాయత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్‌ వంటి అంశాలతో రూపొందిన ఈ ఫ్యాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా సెప్టెంబరు 3న విడుదలæ కానుంది. ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు –దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్, పార్థ్‌ తివారీ, సంయుక్త విశ్వనాథన్‌ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జిమ్‌ వర్గీస్‌తో కలిసి దుల్కర్‌ సల్మాన్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ రిలీజ్‌ చేస్తుంది.  

మలయాళ నటుడు నివిన్‌ పౌలి హీరోగా, మమితాౖ బెజు హీరోయిన్‌గా నటించిన లవబుల్‌ అండ్‌ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా ‘బెత్లెహోమ్‌ కుటుంబయూనిట్‌’. సూపర్‌హిట్‌ ‘ప్రేమలు’ ఫేమ్‌ దర్శకుడు గిరీష్‌ ఏడీ తెరకెక్కించిన ఈ సినిమాను ఫాహద్‌ ఫాజిల్, దిలీష్‌ పోతన్, శ్యామ్‌ పుష్కరన్‌ నిర్మించారు. మలయాళంలో ఆగస్టు 21న విడుదలైన ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. తాజాగా ఈ సినిమాను తెలుగులో సెప్టెంబరు 4న రిలీజ్‌ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. వయసు వ్యత్యాసంతో కూడిన లవ్‌స్టోరీగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. 

సూపర్‌హిట్‌ పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’ ఆధారంగా ‘మిర్జాపూర్‌:ది మూవీ’ అనే హిందీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అలీ ఫజల్, పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు, జితేంద్ర కుమార్, రవి, అభిషేక్‌. బి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వంలో రితేష్‌ సిద్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 4న విడుదల కానుంది. 

తమిళ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఆల్మోస్ట్‌ తెలుగులోనూ రిలీజ్‌ అవుతుంటాయి. తాజాగా కార్తీ హీరోగా నటించిన తమిళ సినిమా ‘సర్దార్‌ 2’. కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన హిట్‌ ఫిల్మ్‌ ‘సర్దార్‌’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎస్‌జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్‌లు ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో నటించారు. ఇందులో తండ్రీ కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు కార్తీ. దేశభక్తి, తండ్రీ కొడుకుల భావోద్వేగం ప్రధానంగా ఈ సినిమా కథనం సాగుతుంది. ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్, ఇషాన్‌ సక్సేనా కలిసి ‘సర్దార్‌ 2’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబరు 10న విడుదలæకానుంది. 

తెలుగు హీరో సుహాస్‌ నటించిన తొలి తమిళ సినిమా ‘మండాడి’. ఈ చిత్రంలో సూరి, సుహాస్‌ మెయిన్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు. సుహాస్‌ క్యారెక్టరైజేషన్‌లో నెగటివ్‌ షేడ్స్‌ కనిపిస్తాయి. మహిమా నంబియార్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్రెడ్‌ కుమార్‌ సమర్పణలో ఆర్‌ఎస్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానర్‌ పై మదిమారన్‌ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. సముద్రంపై సాగే పడవల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుందని యూనిట్‌ పేర్కొంది. 

కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రధారిగా సనంత్, రిషికాంత్‌ ఇతర కీలక పాత్రధారులుగా నటించిన పీరియాడికల్‌ విలేజ్‌ డ్రామా ‘డొరోతి’. కార్తీక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జ్యోతి దేశ్‌పాండే, గునీ™Œ æమోంగా, అచిన్‌ జైన్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 25న విడుదల  కానుంది. స్నేహం, ఆశ, ఆశయం, పక్షపాత ధోరణి వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని కోలీవుడ్‌ టాక్‌.

ఈ సినిమాలే కాకుండా... జీవీ ప్రకాష్‌కుమార్‌ హీరోగా నటించిన తమిళ సినిమా ‘ఇమ్మోర్టల్‌’, ‘డీమాంటీ కాలనీ 3’ వంటివి సెప్టెంబరు నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కోవలో మరికొన్ని పరభాషా సినిమాలు ఉన్నాయి.  

– ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement