
కాల్పులు, హెచ్చరికల నేపధ్యంలో ఖుష్బూ స్ట్రాంగ్ రిప్లై..
బరేలీలోని తన కుటుంబ నివాసం వెలుపల జరిగిన దిగ్భ్రాంతికరమైన కాల్పుల సంఘటన తర్వాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ మేజర్ కుమార్తె, బాలీవుడ్ నటి దిశా పటానీ(Disha Patani) సోదరి ఖుష్బూ పటానీ వీటికి తనదైన శైలిలో బలంగా బదులిచ్చారు.
తన ఇన్ స్ట్రాగామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో ఆమె తనను తాను రక్షించుకోవడానికి కేవలం ఒక డేటా కేబుల్ వంటి సాధారణ రోజువారీ వస్తువు కూడా సరిపోతుందంటూ తనను చంపుతామని బెదిరిస్తూన్న వర్గాలకు ఆమె పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు ప్రమాద క్షణాల్లో తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లోని సాధారణ వస్తువులనే ఎలా సృజనాత్మకంగా ఉపయోగించవచ్చో ఖుష్బూ ఈ వీడియోలో వివరంగా ప్రదర్శించింది.
బెదిరింపు పరిస్థితులలో ప్రతిస్పందించడానికి ఎల్లప్పుడూ ఆయుధాలు లేదా యుద్ధ కళల్లో శిక్షణ వంటివి అవసరం లేదని ఈ వీడియోలో ఆమె హైలైట్ చేస్తుంది. బదులుగా, కొంత సమయస్ఫూర్తి, తెగింపు, చురుకుగా ప్రతిస్పందించడం వంటివి సరిపోతాయంటూ ఆమె సాటి మహిళలకు సందేశాన్ని అందించింది. ఒక డేటా కేబుల్ వైర్‌ను దానిలో పొదిగిన కొన్ని ఇనుప వస్తువులను ఆమె ఒక బలమైన ఆయుధంగా మార్చింది. ఆ వైర్ చూడడానికి సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ ఆత్మరక్షణ సమయంలో ఎదుటి వ్యక్తి ముఖం పగలగొట్టడానికి సరిగ్గా సరిపోతుందని ఆమె స్పష్టం చేసింది. కాల్పుల అనంతరం ధైర్యంగా స్పందిస్తూ, ఖుష్బూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చాలామంది నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, తెగువను ప్రశంసించారు. ఆమె ఫాలోయర్స్ ఆమెను ఒక ఆధునిక యోథురాలుగా కొనియాడారు. ‘‘మేము ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాం మేడమ్’’ అంటూ మరికొందరు ప్రోత్సహించారు. ‘‘మేడమ్, మీరు అద్భుతంగా స్పందించారు. ఈ పరిస్థితుల్లో ఇలా బలంగా ఉండటానికి ధైర్యంతో పాటు సంకల్ప శక్తి అవసరం’’ అంటూ కొందరు ఆమెను పొగిడారు. ‘‘నిజంగా మేడమ్, మీరు మాకు చాలా స్ఫూర్తినిస్తున్నారు’’అంటూ మరికొందరు యువతులు ఆమెను కొనియాడారు. కొందరు ఆమె క్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సహజంగానే కొందరు మాత్రం ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ ట్రోల్ చేశారు.
మొత్తం మీద ఈ ఉదంతం ఇప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియని ఒక ప్రముఖ నటి సోదరిగా మాత్రమే గుర్తింపు పొందిన ఒక సాధారణ యువతిని సెలబ్రిటీగామార్చేసింది.
బాలీవుడ్‌ని కుదిపేసిన ఈ కలకలానికి మూలం శుక్రవారం ఉదయం, బరేలీలోని సివిల్ లైన్‌లోని విల్లా నంబర్ 40 వెలుపల మోటారుబైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులుతో మొదలైంది, అక్కడ పఠానీ కుటుంబం నివసిస్తుంది. ఈ కాల్పులకు కారణం తామేనని ఓ అతివాద వర్గం ప్రకటించుకోవడంతో పాటు ఇకపై తమ మనోభావాలు దెబ్బతీస్తే పఠానీ కుటుంబంతో పాటు ఎవరినీ ఉపేక్షించమని హెచ్చరికలు జారీ చేసింది.