నేను అందుకున్న గొప్ప ప్రశంస అదే: కల్యాణ్‌ శంకర్‌ | Director Kalyan Shankar expresses his excitement over MAD Square success | Sakshi
Sakshi News home page

నేను అందుకున్న గొప్ప ప్రశంస అదే: కల్యాణ్‌ శంకర్‌

Apr 1 2025 3:09 AM | Updated on Apr 1 2025 3:09 AM

Director Kalyan Shankar expresses his excitement over MAD Square success

‘‘మ్యాడ్‌’ సినిమా ఎక్కువగా యువతకి చేరువైంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ మూవీని యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.. ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అని డైరెక్టర్‌ కల్యాణ్‌ శంకర్‌ తెలిపారు. నార్నె నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది.

ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టినట్లు ప్రకటించారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో సోమవారం కల్యాణ్‌ శంకర్‌ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మ్యాడ్‌ స్క్వేర్‌’లో పెద్ద కథ ఆశించి సినిమాకి రాకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి’ అని ముందే చెప్పడం మాకు చాలా ప్లస్‌ అయింది. రాజమౌళిగారు కూడా సినిమా మొదలుపెట్టే ముందే కథ ఇలా ఉండబోతుంది అని చెబుతుంటారు. 

అలా చెప్పడం వల్ల ప్రేక్షకులను మనం ముందే ప్రిపేర్‌ చేసినట్టు అవుతుంది. మా ఫ్రెండ్‌ వాళ్ల అమ్మ పదిహేనేళ్ల తర్వాత థియేటర్‌లో చూసిన సినిమా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. ‘సినిమా చూస్తున్నప్పుడు నవ్వి నవ్వి కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ అని ఆమె చెప్పడం నేను అందుకున్న గొప్ప ప్రశంస. ఇతర నిర్మాతల నుంచి కూడా నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాగవంశీగారితో నాకు మంచి ర్యాపో ఉండటంతో ఆయనతోనే వరుస సినిమాలు చేస్తున్నాను. రవితేజగారితో నేను చేయబోయే సినిమాలోనూ కచ్చితంగా వినోదం ఉంటుంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement