
కుబేరతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ (Dhanush) ఇడ్లీ కొట్టు మూవీ (Idly Kadai Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ధనుష్ స్వీయదర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇటీవల సినిమా ఆడియా లాంచ్ ఈవెంట్‌లో ధనుష్ తన బాల్యం గురించి చెప్తూ ఎమోషనలయ్యాడు. చిన్నప్పుడు రోజూ ఇడ్లీ తినాలనుండేదని, కానీ తన దగ్గర అంత డబ్బుండేది కాదన్నాడు.
ట్రోలింగ్‌పై స్పందించిన ధనుష్
ఏదైనా చిన్నపనికి వెళ్లి, ఆ డబ్బుతో ఇడ్లీ కొనుక్కుని తినేవాడినని గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ కామెంట్స్‌పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది. ధనుష్ తండ్రి కూడా ఒక దర్శకుడేనని, అలాంటి వ్యక్తి పేదరికంలో ఎందుకుంటాడని, అంతా కట్టుకథ అని విమర్శించారు. ఈ వివాదంపై మధురైలో జరిగిన ఇడ్లీ కొట్టు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ స్పందించాడు. నా స్పీచ్ మీరు పూర్తిగా విన్నారా? 1983లో నేను పుట్టాను. 1991లో మా నాన్న దర్శకుడయ్యాడు. ఆ ఎనిమిదేళ్లపాటు మేము కష్టపడుతూనే ఉన్నాం. 1995 తర్వాతే మా కుటుంబ పరిస్థితి మెరుగుపడింది. మేము నలుగురం సంతానం కాబట్టి బయట తినడానికి డబ్బు అడిగినప్పుడు ఇచ్చేవాళ్లు కాదు! అందుకే ఏదైనా పని చేసి కొనుక్కునేవాడిని.
అన్న దొంగ
చిన్నప్పుడు నేను అల్లరి ఎక్కువ చేసేవాడిని. మా అన్న సెల్వరాఘవన్ నన్ను మించిపోయేవాడు. నేను 20 పైసలు, చారానా.. ఇలా కాయిన్లు దాచుకునేవాడిని. అవి నాలుగైదు రూపాయలవగానే మా అన్న వాటిని దొంగిలించేవాడు. క్రికెట్ ఆడేటప్పుడు కూడా మూడున్నరగంటలవరకు ఔట్ అవకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉండేవాడు. నేను బౌలింగ్ చేసేవాడిని. నా వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాడిని. కానీ ఎప్పుడైతే అతడు ఔటయి నేను బ్యాట్ పట్టుకుంటానో.. వెంటనే బౌలింగ్ చేయకుండా అక్కడినుంచి పారిపోయేవాడు. అలా నన్ను చీటింగ్ చేసేవాడు అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
బయోపిక్ కాదు
అలాగే ఇదో ప్రముఖ చెఫ్ బయోపిక్ అంటూ వస్తున్న రూమర్లను కొట్టిపారేశాడు. ఇది ఎవరి బయోపిక్ కాదని, తన బాల్యంలో ఎదురైన సంఘటనలు, అనుభవాలు, తన ఊహలను కలగలిపి ఈ సినిమా తీసినట్లు పేర్కొన్నాడు. ఇడ్లీ కొట్టు సినిమా విషయానికి వస్తే ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అరుణ్ విజయ్, రాజ్‌కిరణ్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.
చదవండి: చెల్లికి ఊహించని సర్‌ప్రైజ్.. సీమంతంతోపాటు బేబీకి ఓ గిఫ్ట్