
అందరి నోటికాడ గుడ్లు దొంగతనం చేసిన సంజనాకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలి, అవతలివారు బాధపడేలా కాదని హెచ్చరించాడు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఆమె మెడలో వేయించాడు. అంతే కాదు ఓ పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. అవేంటో అక్టోబర్ 4వ ఎపిసోడ్ హైలైట్స్‌లో మీరూ చూసేయండి..

సంజనాను శిక్షించిన నాగ్
సంజనాను దొంగ వేషాలు మానుకోమని తిట్టిపోశాడు నాగార్జున (Nagarjuna Akkineni). అంతేకాదు, ఓనర్ నుంచి తప్పించి టెనెంట్‌గా మార్చాడు. హౌస్‌లో ఏ పని కావాలన్నా సంజనాతో చేయించుకోవచ్చని ఆమెను శిక్షించాడు. ఇప్పటికైనా ఆమె తప్పు తెలుసుకోకుంటే మాత్రం సంజనా ఎక్కువకాలం హౌస్‌లో ఉండటం కష్టమే! మాస్క్ మ్యాన్ ఒంటరిగా ఉండటం గురించి చురకలు అంటించాడు నాగ్. ఇంట్లో ఉన్న వస్తువులకు, మీకూ తేడా లేనట్లే ఉందన్నాడు.
గోల్డెన్ స్టార్
తర్వాత కంటెస్టెంట్లకు పర్ఫామెన్స్ ఆధారంగా స్టార్ బ్యాడ్జ్‌లు ఇచ్చాడు. నాలుగు వారాలుగా కామెడీతో, ఆటతో, మాటతో మెప్పించిన ఇమ్మాన్యుయేల్‌కు గోల్డెన్ స్టార్ ఇచ్చాడు. తర్వాత శ్రీజను లేపి.. నువ్వు ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడ చెప్తున్నావ్.. అంటూ కెప్టెన్సీ టాస్క్‌లో ఆమె సృష్టించిన గందరగోళం... దాని వల్ల కల్యాణ్- రీతూ, పవన్ మధ్య ఏర్పడిన అగాధం గురించి కాసేపు ప్రస్తావించాడు. శ్రీజ, సుమన్, రాము, డిమాన్, కల్యాణ్, భరణి, దివ్య, రీతూకు సిల్వర్ స్టార్ ఇచ్చాడు.

తనూజను హెచ్చరించిన నాగ్
హౌస్‌కు గెలవడానికి వచ్చావా? బంధాల కోసం వచ్చావా? ఈ బంధాలనేవి ఇంకా పెరిగితే భారంగా మారతాయి. ఏడుస్తూ ఉంటే అదే నీ ఆటను మంచేస్తుంది అని తనూజ (Thanuja Puttaswamy)కు సలహా ఇచ్చాడు. సంజనా- తనూజల పోపు గొడవ గురించి ప్రస్తావిస్తూ.. టీ కప్పులో తుపానులా.. మీ గొడవ పోపులో సునామీలా ఉందని సెటైర్లు వేశారు. రీతూ చౌదరి కెప్టెన్సీ టాస్క్‌లో.. కల్యాణ్‌ను తీసేయమని చెప్పడం కరెక్టేనని వంత పాడాడు నాగ్. కానీ తప్పించడం ఒకటే కాదు, గెలిచి చూపించాలన్నాడు.
కల్యాణ్‌పై ప్రశంసలు
అటు కల్యాణ్‌తో మాత్రం.. మూడువారాలు ఆడిందేమీ లేదు, కానీ ఈవారం అదరగొట్టావ్ అని మెచ్చుకున్నాడు. అలాగే (రీతూ చేతిలో) మోసపోయావనీ అన్నాడు. సంజనాకు అసిస్టెంట్‌లా ఉన్న ఫ్లోరాకు, ఒంటరివాడిగా మిగిలిపోయిన హరీశ్‌కు బ్లాక్ స్టార్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండేందుకు అనర్హులు అని ఓటింగ్ పెట్టగా మెజారిటీ ఫ్లోరాకు ఓట్లేసి ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో నాగార్జున ఆమెను వరుసగా రెండు వారాలకు నామినేట్ చేశారు.