రీతూ చౌదరితో లవ్ ట్రాక్ వల్ల నెగెటివ్ అయ్యాడు కానీ టైటిల్ గెలవడానికి కావాల్సిన అన్ని అర్హతలు డిమాన్ పవన్ (Demon Pavan)కు ఉన్నాయి. ఆటల్లో గట్టిపోటీనిస్తాడు. ఎంతమందినైనా సరే ఒంటిచేత్తో ఆపగలడు. అతడు టాస్కులో దిగాడంటే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఆటలో రఫ్ అండ్ టఫ్ కానీ మాటలో మాత్రం ఉట్టి డొల్ల. గట్టిగా మాట్లాడటం చేతకాదు.
వెనకబడ్డ పవన్
తనను ఎవరైనా నిందిస్తున్నా అమయాకుడిలా పడతాడు, అలుగుతాడు తప్ప రివర్స్ కౌంటరివ్వడం, తిట్టడం చేతకాదు. అందుకే విన్నింగ్ రేస్‌లో లేకుండా పోయాడు. ఫ్యామిలీ టైమ్ కోసం ఇచ్చిన గేమ్‌లో పవన్.. తన ఆట మధ్యలో ఆపేసి దగ్గరుండి సుమన్ తాళ్ల చిక్కుముడులు విప్పుతూ అతడికి సాయం చేశాడు. కానీ, అదెవరికీ కనబడలేదు.

తండ్రి కోసం బెంగ
పవన్‌కు ఎప్పుడూ ఇంతే! అతడు చేసిన మంచి కన్నా, తప్పులే పెద్దగా కనిపిస్తాయి. అదే అతడికి పెద్ద మైనస్. నిన్నటి ఎపిసోడ్‌లో పవన్ తల్లి హౌస్‌లోకి వెళ్లి కొడుక్కి గోరుముద్దలు తినిపించింది. ఆ సమయంలో తండ్రి గురించి తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు పవన్. అసలు పవన్ తండ్రికేమైందో? ఆయన మాటల్లోనే విందాం..
క్యాన్సర్
పవన్ తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ.. ఓరోజు నా పన్ను నాలుకకి గుచ్చుకుని సెప్టిక్ అయింది. దీనికేం అవుతుందులే అనుకున్నాను. కానీ, తర్వాత సమస్య పెద్దదైంది. దాంతో పవన్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఆస్పత్రిలో చూపిస్తే క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. అలా జూన్‌లో సర్జరీ జరిగింది. 4 గంటలపాటు ఈ ఆపరేషన్ జరిగింది.
సరిగ్గా మాట్లాడలేని స్థితిలో..
నాలుగు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఐదో రోజు ఇంటికి వెళ్లిపోయాం. కాకపోతే నోటి లోపల చర్మం కట్ చేశారు. దీనివల్ల మాట సరిగా రావడం లేదు. భోజనం చేయడం కూడా మానేశాను. రోజూ జావ తాగుతున్నాను. కేవలం ద్రవపదార్థాలే తీసుకుంటున్నాను అని తెలిపాడు. అందుకే పవన్ తండ్రిపై బెంగ పెట్టుకున్నాడన్నమాట!


