‘‘అమ్మాయి అచ్చ తెలుగు సాంప్రదాయ సుందరి... సౌభాగ్య లక్ష్మిపోలిక.., అబ్బాయి మాటకారి... మోహనాంగుడే మరి... తానున్న చోటే వేడుక’’ అంటూ సాగుతుంది ‘భల్లే భల్లే’ పాట. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలోని పాట ఇది. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14 సాయంత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఈ సినిమాలోని ‘భల్లే భల్లే’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
‘భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక... మాయే చేసిందిలే... మంత్రం వేసిందిలే’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, హరిచరణ్ పాడారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ‘‘కేరళలోని పచ్చని ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో చిత్రీకరించిన పాట ఇది. ఈ పాటలో శర్వా, సాక్షిల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. హీరో శ్రీవిష్ణు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో సత్య, సునీల్, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.


