బిగ్‌బాస్ అంటేనే ఆటలు, టాస్కులు, గొడవలు, అరుపులు.. షో మొదలైన తొలి రోజే ఇవన్నీ కనిపించాయి. ఒకవైపు ‘మ్యాజికల్ కీస్’ కోసం పోటీ.. మరోవైపు హౌస్‌మేట్స్ హోదా కోసం ‘మహా పరీక్ష’. ఇక టీమ్ లీడర్ల ఎంపిక దగ్గరికి వచ్చేసరికి సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా హౌస్ రెండుగా విడిపోయిన పరిస్థితి కనిపించింది. మాటల యుద్ధంతో హౌస్‌లో వేడి వాతావరణం నెలకొంది. ఇంతకీ తొలిరోజు ఏం జరిగింది? ఎవరి చేతికి ఎలాంటి పవర్స్ వచ్చాయి? ఎవరు ఏ టీమ్‌కు నాయకులుగా నిలిచారు? తొలిరోజు హైలెట్స్‌పై ఓ లుక్కేయండి..
మరో ఇద్దరి చేతికి మ్యాజికల్ కీస్!
బిగ్‌బాస్ ఇంట్లో మొత్తం 16 మంది ఉండగా.. ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు మ్యాజికల్ కీస్‌ను సొంతం చేసుకున్నారు. మరో ఇద్దరికి కీస్ రావాల్సి ఉండటంతో.. ఈ వారమంతా ‘మహా పరీక్ష’ ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. వచ్చే వారంలో చాలామంది ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని, ఇంకా ఎవరూ పూర్తి స్థాయి హౌస్‌మేట్స్ కాలేదని స్పష్టం చేశాడు. మ్యాజికల్ కీస్ సాధించిన ఎనిమిది మంది కలిసి మరో ఇద్దరిని ఎంపిక చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో త్రిగుణ్ వంశీ, కృష్ణుడు పేర్లను ప్రతిపాదించాడు. మరోవైపు షాలినీ రోహిత్ పేరును సూచించింది. కొద్దిసేపు చర్చ జరిగిన అనంతరం అందరూ కలిసి వంశీ, కృష్ణుడు పేర్లకు ఓటు వేశారు. దీంతో వారిద్దరూ కూడా మ్యాజికల్ కీస్‌ను దక్కించుకున్నారు.
రోహిత్ టాస్క్ చేయలేదంటూ త్రిగుణ్ ఫైర్
బిగ్‌బాస్ ఇచ్చిన వాటర్ కొట్టే టాస్క్‌ను రోహిత్ చేయలేదంటూ పలువురు కంటెస్టెంట్లు ప్రస్తావించారు. ఇదే విషయాన్ని త్రిగుణ్ కూడా పదేపదే ప్రస్తావిస్తూ తన వాదనను వినిపించాడు. అయితే తమ నిర్ణయం అందరికీ నచ్చకపోవడంపై దేబ్జానీ అసంతృప్తి వ్యక్తం చేసింది.‘మీ నిర్ణయం నాకు ఫెయిర్‌గా అనిపించలేదు’ అంటూ రాం ప్రసాద్‌తో దేబ్జానీ చెప్పింది. అయితే సెలెబ్రిటీ కేటగిరీలో ఉన్న ఇద్దరికే అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందంటూ సరదాగా నవ్వేసింది.
వర్షిణితో అమన్ ఫ్లర్టింగ్..
ఇక హౌస్‌లో కొన్ని సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. కిచెన్‌లో ఝాన్సీ, వర్షిణి టీ తయారు చేస్తుండగా.. అక్కడికి వచ్చిన అమన్ వర్షిణితో సరదాగా ఫ్లర్ట్ చేశాడు. వర్షిణి టీ చేస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఆమెను పొగిడాడు. మరోవైపు బెడ్రూంలో రాం ప్రసాద్, నరేష్, దేబ్జానీ సరదాగా మాట్లాడుకున్నారు. రాం ప్రసాద్‌ను ‘రామన్న’ అంటూ పిలిచిన దేబ్జానీ.. ఇంట్లో జెన్యూన్ పర్సన్ నువ్వే అంటూ ప్రశంసించింది.
త్రిగుణ్, షాలినీ మధ్య కిచెన్‌లో గొడవ
కిచెన్‌లో చపాతీలు చేస్తున్న త్రిగుణ్ వద్దకు వచ్చిన షాలినీ కర్రీ గురించి అడిగింది. అయితే ‘అది నా కేటగిరీ కాదు’ అని త్రిగుణ్ సమాధానం ఇచ్చాడు. ఆ మాటను షాలినీ తప్పుగా తీసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సాధారణంగా కూడా చెప్పొచ్చు కదా అంటూ షాలినీ ప్రశ్నించడంతో మాటామాటా పెరిగింది.
నామినేషన్స్‌పై నరేష్, రాం ప్రసాద్ కామెడీ
మరోవైపు నామినేషన్స్ గురించి నరేష్, రాం ప్రసాద్ సరదాగా మాట్లాడుకున్నారు. గార్డెన్‌లో తిరుగుతూ ‘వాళ్లని చేద్దాం.. వీళ్లని చేద్దాం.. వద్దులే పాపం.. వాళ్లకి ఫ్యామిలీ ఉంది.. వీళ్లకి ఈ కష్టాలున్నాయి’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేసుకున్నారు. చివరికి మనిద్దరమే మిగిలాం.. ఒకరినొకరం నామినేట్ చేసుకుందాం అంటూ ఇద్దరూ నవ్వులు పూయించారు.
ఒక్కొక్కరి చేతికి ఒక్కో పవర్
మ్యాజికల్ కీస్ సొంతం చేసుకున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ బిగ్‌బాస్ పిలిచి.. వారి కీ ద్వారా లభించే పవర్ ఏంటో వివరించాడు. అయితే తమకు వచ్చిన పవర్ గురించి ఇతర కంటెస్టెంట్లతో చర్చించవద్దని వార్నింగ్ ఇచ్చాడు.
ముందుగా త్రిగుణ్‌కు ‘టేక్ ఓవర్’ పవర్ వచ్చింది. అంటే తనకు నచ్చిన మరో కంటెస్టెంట్ పవర్‌ను తీసుకునే అవకాశం అతడికి లభించింది. ఝాన్సీకి ఓ పవర్ ఇచ్చి వీకెండ్ ప్రారంభం కావడానికి ముందు వీక్‌లో ఎప్పుడైన దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పాడు. ఎలిమినేషన్ భయం ఉంటే ఈ పవర్‌ని యూజ్ చేసుకొని సేవ్ కావచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు.
ముఖేష్ గౌడ: ఇతరుల పవర్‌ను రివర్స్ చేసే అవకాశం
వర్షిణి: ‘గ్రాబ్ ఎనీ విన్’ పవర్
కృష్ణుడు: ‘స్వాప్’ పవర్
షాలినీ: ఇంట్లోని ఒక డ్యూటీని అసైన్ చేసే పవర్
శ్రిష్టి: ఒకరిని నేరుగా నామినేట్ చేసే పవర్
రాం ప్రసాద్: ‘సేఫ్ షీల్డ్’.. నామినేషన్ నుంచి ఒకరిని కాపాడే అవకాశం
నరేష్: నామినేషన్స్‌లో డబుల్ ఓట్స్ వేసే పవర్.. ఇలా మ్యూజికల్ కీస్ గెలుచుకున్న ఒక్కొక్కరికి ఒక్కో పవర్స్ ఇచ్చాడు బిగ్ బాస్
కిచెన్, క్లీనింగ్ డ్యూటీల దగ్గర మళ్లీ గొడవ
ఆ తర్వాత హౌస్‌లో కిచెన్, క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ వంటి పనులను విభజించే ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలోనూ త్రిగుణ్‌తో గొడవ జరిగింది.సుధీర్ డిష్ వాషింగ్ బాగా చేశాడని చెప్పడంతో.. ‘మేం చేయలేమా?’ అంటూ ముఖేష్, రోహిత్, సుధీర్, షాలినీ తదితరులు వాదనకు దిగారు. డ్యూటీలను ఎవరు ఎలా చేయాలనేది తామే నిర్ణయించుకుంటామని వారు స్పష్టం చేశారు.
దేబ్జానీ బ్యాటరీని సరిగ్గా ధరించకపోవడంతో బిగ్‌బాస్ ఆమెను హెచ్చరించాడు. అయితే ‘ఎందుకు బిగ్‌బాస్.. క్యూట్‌గా చెప్పొచ్చు కదా’ అంటూ దేబ్జానీ సరదాగా స్పందించింది. చివరకు బిగ్‌బాస్‌కు సారీ చెప్పింది. దీనికి బిగ్‌బాస్ కూడా ఆసక్తికరంగా స్పందిస్తూ.. తాను స్కూల్ ప్రిన్సిపల్‌నో.. సాంటానో మున్ముందు తెలుస్తుందని చెప్పాడు.
హౌస్‌మేట్ హోదా కోసం ‘మహా పరీక్ష’
ఇక అసలు ఆట ఇక్కడే మొదలైంది. ‘హౌస్‌మేట్స్ హోదాను పొందడమే మీ లక్ష్యం. నామినేషన్లో లేకపోయినా అందరికీ ఆడియెన్స్ ఓట్లు వేస్తారు. మహా పరీక్షలో గెలిచి హౌస్‌మేట్ హోదాను పొందాలి. ఎలిమినేషన్ మాత్రం కన్ఫామ్’ అంటూ బిగ్‌బాస్ కీలక ప్రకటన చేశాడు.అంతేకాకుండా 16 మంది రెండు టీమ్‌లుగా విడిపోయి.. హై రిస్క్ నుంచి నో రిస్క్ వైపు తీసుకెళ్లగల సత్తా ఉన్న ఇద్దరు నాయకులను ఎంచుకోవాలని సూచించాడు.
లీడర్‌గా రోహిత్.. రాంప్రసాద్
టీమ్ లీడర్ల ఎంపికలో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్లలో దాదాపు అందరూ రోహిత్‌కు మద్దతు తెలిపారు. ఒక్క ఝాన్సీ మాత్రమే మినహాయింపు. మరోవైపు సెలెబ్రిటీ కంటెస్టెంట్లు రాం ప్రసాద్, త్రిగుణ్ పేర్లకు ఓటు వేశారు.అయితే త్రిగుణ్ మాత్రం రాం ప్రసాద్‌ను లీడర్‌గా ఉంచాలని సూచించాడు. అగ్నిపరీక్ష టీమ్ మొత్తం కలిసి రోహిత్‌కు ఓటు వేసిందని, వాళ్లంతా ఒక గ్రూప్‌గా ఉన్నారని త్రిగుణ్ వ్యాఖ్యానించాడు. తాను మాత్రం ఝాన్సీకి ఓటు వేసినట్లు చెప్పాడు.
త్రిగుణ్‌పై షాలినీ, శ్రిష్టి ఫైర్
త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలతో షాలినీ, శ్రిష్టి, రోహిత్, చరణ్, అమన్ తదితరులు అతడిపై మాటల దాడికి దిగారు.‘మేం రోహిత్ ఆట చూశాం.. అందుకే అతడిని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు కూడా సెలెబ్రిటీలకే ఓట్లు వేసుకున్నారు కదా.. మరి మేం అలా అన్నామా?’ అంటూ షాలినీ, శ్రిష్టి ప్రశ్నించారు.దీంతో హౌస్‌లో మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు బిగ్‌బాస్ ఇంట్లో రెండు టీమ్‌లు ఏర్పడ్డాయి. బ్లూ టీమ్‌కు రాం ప్రసాద్, రెడ్ టీమ్‌కు రోహిత్ నాయకులుగా నిలిచారు. లీడర్ల ఎంపికతో తొలి రోజు ఎపిసోడ్ ముగిసింది.
మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ తొలి రోజే ఆటకు కావాల్సిన మసాలా మొత్తం కనిపించింది. మ్యాజికల్ కీస్, కొత్త పవర్స్, నామినేషన్స్ చర్చలు, వ్యక్తిగత గొడవలు, సెలెబ్రిటీలు వర్సెస్ అగ్నిపరీక్ష సభ్యులుగా మారిన గ్రూప్ వార్.. ఇలా తొలిరోజే హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ‘మహా పరీక్ష’లో ఎవరు నెగ్గుతారు? ఎవరు హౌస్‌మేట్స్‌గా కొనసాగుతారు? ఎవరి ప్రయాణం మధ్యలోనే ముగుస్తుందో చూడాలి.


