'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్ | Baahubali: The Torch Bearer Review In Telugu | Sakshi
Sakshi News home page

Baahubali: The Torch Bearer - మూవీకి ఏం తక్కువ కాదు.. తెర వెనక సంగతులు

Jun 28 2026 3:31 PM | Updated on Jun 28 2026 3:45 PM

Baahubali: The Torch Bearer Review In Telugu

తెలుగు సినిమా దశాదిశా మార్చిన సినిమా 'బాహుబలి'. దీని గురించి కొత్తగా ఏం చెబుతాం. రెండు భాగాల్ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు వందలసార్లు చూశారు. టీవీ, మొబైల్‌లో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. అయితే మూవీస్ వచ్చి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 'బాహుబలి ద టార్చ్ బేరర్' పేరిట ఓ డాక్యుమెంటరీ తీశారు. మూడురోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. తెర వెనక సంగతుల్ని మూవీ టీమ్ అంతా పంచుకున్నారు. ఇంతకీ ఈ డాక్యుమెంటరీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)

డాక్యుమెంటరీ అనగానే హా ఏముంది, కూర్చుని మాట్లాడుతుంటారు.. ఏం చూస్తాంలే అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. 'బాహుబలి ద టార్చ్ బేరర్' గురించి ప్రకటన వచ్చినప్పుడు చాలామంది ఇలానే అనుకున్నారు. కానీ ఈ డాక్యుమెంటరీని చూస్తుంటే సినిమాకు ఏం తక్కువ కాదని అనిపించింది. ఎందుకంటే 123 నిమిషాల నిడివితో నాలుగు ఎపిసోడ్లుగా దీన్ని ప్రెజెంట్ చేశారు. ద డ్రీమ్, బిల్డింగ్ ద డ్రీమ్, బియాండ్ డ్రీమ్స్, ద టార్చ్ బేరర్ పేరిట ఎపిసోడ్స్ ఉన్నాయి.

అసలు 'బాహుబలి' చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎలా రూపుదిద్దుకుంది? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్.. ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు? కొంత బడ్జెట్ అనుకున్నది కాస్త రోజురోజుకి ఎలా పెరిగిపోయింది? ఒక భాగం అనుకున్నది కాస్త రెండు భాగాల సినిమాగా ఎలా మారింది? అప్పట్లో వందల కోట్ల బడ్జెట్ పెట్టడం అనేది ఎంత కష్టమైంది? అనే విషయాల్ని నిర్మాతలు చెబుతూ, అప్పటి ఫుటేజీ చూపించడం క్రేజీగా అనిపించింది.

మరీ ముఖ్యంగా రెండో ఎపిసోడ్ చివరలో 'బాహుబలి'కి తెలుగులో ఫ్లాప్ టాక్ రావడంతో రాజమౌళి, మూవీ టీమ్ అంతా ఎంతలా భయపడ్డారు? మానసికంగా ఎలాంటి దారుణమైన పరిస్థితిని అనుభవించారు. రమ రాజమౌళి అయితే సినిమా నష్టాల్ని కవర్ చేసేందుకు తనకు మణికొండలో ఉన్న స్థలాన్ని అమ్మేద్దామని డిసైడ్ కావడం లాంటి కామెంట్స్ ఆసక్తికరంగా అనిపించాయి. ఈ డాక్యుమెంటరీలో నటీనటుల కష్టం దగ్గర నుంచి రాజమౌళి విజన్ వరకు, దాన్ని ప్రతి ఒక్కరూ రియాలిటీలో తీసుకొచ్చేందుకు ఎంతలా కష్టపడ్డారు అనేది డీటైల్డ్‌గా చూపించారు.

సాధారణంగా సినిమాల్లో ఉన్నట్లే ఈ డాక్యుమెంటరీలోనూ హై మూమెంట్స్ ఉన్నాయండోయ్. 'బాహుబలి' ప్రభావం ప్రపంచంలోని లక్షల జనాభా ఉండే చిన్న చిన్న దేశాల వరకు ఎలా పాకింది అనేది కూడా చెప్పారు. ఓసారి బ్యాంకాక్‌లో డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వెళ్తే.. గంటసేపు వెయిట్ చేయమని చెప్పారని, తాను ఇలా 'బాహుబలి' ఫ్రెండ్ అని చెప్పగానే సదరు డాక్టర్ వెంటనే పూరీకి ట్రీట్‌మెంట్ ఇచ్చేశాడని ప్రభాస్ చెప్పడం.. ఈ సినిమాలో కుమార వర్మ పాత్ర, జపాన్‌లో తనకు అద్భుతమైన ఫ్యాన్ బేస్ సంపాదించి పెట్టడం గురించి నటుడు సుబ్బరాజు చెప్పడం, అలానే జపాన్‌లోని ఓ మహిళా అభిమాని చనిపోతే ఆమె భర్త వచ్చి తనన కలవడం గురించి సుబ్బరాజు చెప్పినప్పుడు ఎమోషనల్ అనిపించింది.

'బాహుబలి' రెండో భాగం కోసం ఎదురుచూడటం, ఇదొచ్చేలోపు చనిపోతానేమో భయపడ్డానని తన వదినతో ఓ క్యాన్సర్ పేషెంట్ చెప్పడం లాంటి సంగతుల్ని రాజమౌళి పంచుకున్నారు. ఇక చివరలో 'మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం? సాహో అని ప్రపంచము! తానూ నమ్మిన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతుంటే, తలొంచదా విధి సైతం! జై మహిష్మతి!' అని రాజమౌళి చెప్పి ముగించడం క్రేజీగా అనిపించాయి. 'బాహుబలి'కి మూడో భాగం కూడా ఉంటుందని ప్రభాస్-రానా-అనుష్క హింట్ ఇవ్వడంతో ఈ డాక్యుమెంటరీని ముగించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement