బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.. దక్షిణాది ప్రేక్షకులకు కూడా తన సినిమాలతో సుపరిచతమే. రీసెంట్ టైంలో మహారాజా, డెకాయిట్ లాంటి తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పరంగా ఈయన ఎలాంటి మూవీస్ తీశారు, తీస్తున్నారు అనేది పక్కనబెడితే వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకంటే 20 ఏళ్ల చిన్నదైన అమ్మాయితో డేటింగ్ చేస్తుండటం గురించి మాట్లాడారు. ఈ మేరకు తమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: విశాల్ సినిమాకు దారుణ పరిస్థితి.. రూ.కోటి కూడా రాలేదు!)
అనురాగ్ కశ్యప్ గతంలో ఆర్తి బజాజ్ అనే ఎడిటర్‌ని పెళ్లి చేసుకున్నాడు. 12 ఏళ్ల పాటు సాగిన వీరి వైవాహిక జీవితం 2009లో ముగిసింది. తర్వాత నటి కల్కి కొచ్లిన్‌ని పెళ్లాడాడు. నాలుగేళ్లు అయ్యేసరికి వీళ్లు విడిపోయారు. అనంతరం కర్ణాటకకు చెందిన శుభ్రా శెట్టి అనే అమ్మాయితో అనురాగ్ ప్రేమలో పడ్డాడు. అలా గత 11 ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. దాదాపు పదేళ్ల క్రితం అనురాగ్ తన ఇన్ స్టాలో శుభ్రాతో కలిసి ఉన్న ఫొటోలని షేర్ చేయడంతో వీరి బంధం బహిరంగమైంది. తర్వాత కాలంలో వీళ్లు మీడియాకు దూరంగానే ఉంటూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో తమ ప్రేమ, వయసు తేడా, రిలేషన్‌షిప్‌లో ఎదురైన సవాళ్ల గురించి ఇద్దరూ మాట్లాడారు.

'తొలి రోజుల్లో మా బంధాన్ని మీడియాకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాం. మా వ్యక్తిగత జీవితంపై చర్చ జరగకూడదని అనుకున్నాం. కానీ ఓ జర్నలిస్ట్ మా రిలేషన్ గురించి ఆర్టికల్ రాయడంతో అది బయటపడింది. నాకు 20 ఏళ్ల వయసున్నప్పుడు అనురాగ్‌తో డేటింగ్ ప్రారంభించాను. అప్పటికే అనురాగ్‌కు పెళ్లయి ఓ కూతురు ఉంది. దీంతో మా సంబంధంపై నా తల్లిదండ్రులు మొదట్లో కంగారుపడ్డారు. చివరకు మా నిర్ణయాన్ని అంగీకరించారు. నా కంటే అనురాగ్‌కు జీవితానుభవం ఎక్కువ. దీంతో ఆయన నాకు స్వేచ్ఛ ఇచ్చారు. మొదట్లోనే అనురాగ్ నాపై ప్రేమ బయటపెట్టేశారు. కానీ నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయకుండా, జీవితంపై నాకంటూ ఓ క్లారిటీ తెచ్చుకునేందుకు టైమ్ ఇచ్చారు' అని శుభ్రా చెప్పింది.
'మా జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. నాకు సిగ్గుగా అనిపించలేదు కానీ ఓ దశలో వయసు తేడా కారణంగా నేను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. ఆమెని నా నుంచి దూరం పెట్టాలని ప్రయత్నించాను. ఆమె ముఖంలో వయసు పెద్దగా కనిపించదు. నేను వయసు పెరుగుతున్నా ఆమె మాత్రం అలాగే కనిపిస్తుండటంతో నాకు మరింత ఇబ్బందిగా అనిపించేది. ఓ దశలో శుభ్రా నాతో కలిసి షూటింగ్‌లో పాల్గొంది. ఆ అనుభవం మా బంధంపై నాకు మరింత క్లారిటీ వచ్చేలా చేసింది. చివరకు నాకు కావాల్సిన వ్యక్తి ఈమె అని నిర్ణయించుకున్నాను' అని అనురాగ్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: వంటల ప్రోగ్రామ్‌లో సమంత.. ప్రెగ్నెన్సీతో చేస్తుందా?)


