
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)- జయ బచ్చన్ పెళ్లి చేసుకుని 50 ఏళ్లు పైనే అవుతోంది. అయితే జయను ప్రేమించి పెళ్లాడటానికి ముందు బిగ్‌బీ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట! ఈ విషయాన్ని నటుడు, రచయిత హనిఫ్ జవేరీ వెల్లడించాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనిఫ్ మాట్లాడుతూ.. అమితాబ్ ముంబైకి రావడానికి ముందు ఓ అమ్మాయిని ప్రేమించాడు. తన పేరు మాయ. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో పనిచేసేది.
సినిమాల్లోకి రాకముందే లవ్‌స్టోరీ..
అమితాబ్ తనను ఎంతగానో ప్రేమించాడు. ఆమె కూడా ఆయన్ను అంతే ఇష్టపడింది. సినిమాల్లో పని వెతుక్కుందామని అమితాబ్ ముంబై వచ్చేశాడు. ముంబైలోని జుహులో.. తల్లి తేజ్ బచ్చన్ స్నేహితురాలి ఇంట్లో ఉన్నాడు. తరచూ మాయ ఆ ఇంటికి వచ్చి అతడిని పలకరిస్తూ ఉండేది. అయితే బిగ్‌బీ తల్లి స్నేహితురాలు కూడా అదే ఇంట్లో ఉండేది. దీంతో తన ప్రేమ వ్యవహారం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని అమితాబ్ చాలా భయపడ్డాడు.
తొలి సినిమా షూటింగ్‌లో..
ఆ ఇంటి నుంచి వచ్చేసి బయటెక్కడైనా రెంట్‌కు ఉండాలనుకున్నాడు. అప్పుడు అమితాబ్ తన ఫస్ట్ మూవీ సాట్ హిందుస్తానీ సినిమా చేస్తున్నాడు. ఇందులో నటుడు అన్వర్ అలీ (Anwar Ali)తో కలిసి నటించాడు. తన బాధను అన్వర్‌తో చెప్పుకున్నాడు. విషయం అర్థమైన అన్వర్.. బిగ్‌బీని తన ఇంట్లోనే ఉండమన్నాడు. అలా అన్వర్ అపార్ట్‌మెంట్‌లో బిగ్‌బీ, మాయ చాలాకాలంపాటు కలిసున్నారు. బహుశా వాళ్లు పెళ్లి కూడా చేసుకునుండొచ్చు.
అందరి ముందు అవమానించేది
కానీ ఆ సమయంలో అమితాబ్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. అమితాబ్‌కు మొహమాటం ఎక్కువ. మాయ మాత్రం కన్నింగ్‌గా ఉండేది. నోటికొచ్చినట్లు మాట్లాడేది. కొన్నిసార్లు అమితాబ్ పక్కన ఎవరున్నారన్నది కూడా చూసుకోకుండా తిట్టేసేది. అమితాబ్ స్నేహితులకు ఆమె పద్ధతి అస్సలు నచ్చేది కాదు. అతడు కూడా ప్రియురాలు అవమానించడంతో సిగ్గుతో చచ్చిపోయేవాడు. ఒకసారి గోవాకు షూటింగ్‌కు వెళ్లినప్పుడు మాయకు బ్రేకప్ చెప్పమని అన్వర్ సలహా ఇచ్చాడు.
ఫస్ట్ సినిమా రిలీజ్‌కు ముందే బ్రేకప్
సినిమాల్లో ఇంకా పైస్థాయికి వెళ్లేకొద్దీ సమస్యలు ఎక్కువవుతాయని హెచ్చరించాడు. అమితాబ్‌కు కూడా అది నిజమేననిపించింది. తమ బంధంలో ఏదో సరిగా లేదని ఎన్నాళ్లుగానో అతడు అసంతృప్తిగా ఫీలవుతున్నాడు. దీంతో ఆమెను దూరం పెట్టాడు. తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. అమితాబ్ తొలి చిత్రం సాట్ హిందుస్తానీ 1969లో రిలీజైంది. హీరోయిన్ జయను 1973లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి శ్వేత బచ్చన్, అభిషేక్ బచ్చన్ సంతానం.
చదవండి: ఛాన్సుల కోసం బిజీ రెస్టారెంట్లో పిచ్చిదానిలా ఏడవాలా? అక్కర్లేదు!