
కొన్ని ఆడిషన్స్ చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎంత సిద్ధమై వచ్చినా సరే ఊహకందని పనులు చేయిస్తారు. అలా తనకు జరిగిన ఓ విచిత్ర ఆడిషన్‌ను గుర్తు చేసుకుంది బాలీవుడ్ నటి ఇషా తల్వార్ (Isha Talwar). ఓ ఆడిషన్ కోసం యష్ రాజ్ ఫిలింస్ సంస్థకు చెందిన కాస్టింగ్ డైరెక్టర్ షనూ శర్మను కలిశాను. నాకు ముంబై వెర్సోవాలో ఓ రెస్టారెంట్‌లో సీన్ ఉందన్నారు. అక్కడికి వెళ్లి అందరి మధ్యలో గట్టిగా ఏడవాలని చెప్పారు.
రెస్టారెంట్‌లో ఏడవమన్నారు
నటి ఎటువంటి సన్నివేశాలకైనా అభ్యంతరం చెప్పకూడదన్నారు. షనూ, తన అసిస్టెంట్లతో కలిసి రెస్టారెంట్‌లో నా ముందే కూర్చుంది. అందరూ భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో అందరికీ వినబడేలా గట్టిగా ఏడ్వాలని చెప్పేసరికి అంతా అయోమయంగా అనిపించింది. అలా చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఒక అమ్మాయిని ఇలా పదిమందిలో ఏడిపించడం దేనికో నాకస్సలు అర్థం కాలేదు.

ఇదేం ఆడిషన్?
ఆఫీస్‌లో ఆడిషన్ పెట్టుకుంటారు కానీ, ఇలా జనం మధ్యలోనా? పోనీ.. సహజంగా రావాలంటే ఏదైనా రెస్టారెంట్‌ను కాసేపటికి అద్దెకు తీసుకుని ఆడిషన్ చేయాలి!ఏదేమైనా ఇది దాదాపు పదేళ్ల కిందట జరిగిన సంఘటన. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవాళ్ల కోసం ఈ స్టోరీ పెడుతున్నాను. ఎవరూ ఒత్తిడికి గురి కాకండి. నేనైతే అలా రెస్టారెంట్‌లో ఏడవనని చెప్పేశాను, దీంతో సదరు సినిమాలో అవకాశం కూడా దక్కలేదు. కానీ, ఛాన్సుల కోసం ఇలా రెస్టారెంట్‌లో అస్సలు ఏడవలేను అని చెప్పుకొచ్చింది.
ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఎవరంటే?
ఇషా.. మీర్జాపూర్ వెబ్ సిరీస్, ఆర్టికల్ 15 చిత్రాల్లో నటించింది. కాగా ఈ సీనియర్ కాస్టింగ్ డైరెక్టర్ షనూ.. బాలీవుడ్‌కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసింది. వారిలో రణ్‌వీర్ సింగ్, భూమి పడ్నేకర్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ మధ్యే సయ్యారా మూవీతో అహాన్ పాండే, అనీత్ పడ్డాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.
చదవండి: ఫ్యామిలీతో అల్లు అర్జున్ డిన్నర్.. అర్హకు ఇబ్బంది కలగొద్దని