అల్లు హీరోకి 'వినాయక చవితి' ఇ‍బ్బందులు.. పోలీస్ కంప్లైంట్ | Allu Sirish Complaint Police Over Vinayaka Chavithi Loud Music | Sakshi
Sakshi News home page

Allu Sirish: 'చవితి' సమస్య.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలుగు హీరో

Sep 28 2026 7:15 AM | Updated on Sep 28 2026 7:18 AM

Allu Sirish Complaint Police Over Vinayaka Chavithi Loud Music

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి గత రెండు వారాలుగా కనిపించింది. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు అంతా బాగా ఎంజాయ్ చేశారు. అదే టైంలో వీటి వల్ల ఇబ్బంది పడినవాళ్లు కూడా ఉండే ఉంటారు. కొన్నిరోజుల క్రితం ఈ సమస్యపై స్పందించిన పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. రాత్రిపూట నిమజ్జనాలు ఎందుకు? సాయంత్రం 6-7 గంటల్లోపు చేసుకోవచ్చుగా అని సలహా ఇచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ కూడా ఇదే వినాయక చవితి వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

'గౌరవనీయులైన హైదరాబాద్ పోలీసుల్లారా.. నేను షేక్‌పేటలోని అపర్ణా వన్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను. గత కొన్నిరోజుల నుంచి వినోభానగర్‌లోని హనుమాన్ ఆలయంలో అర్థరాత్రి వరకు పెద్ద శబ్దాలతో సంగీతాన్ని పెడుతూ స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. రాత్రి 2–3 గంటల వరకు ఇది ఉంటోంది. ఈ విషయంపై గతంలోనే ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సెప్టెంబర్ 25 వరకు సహకరించాలని పోలీసులు నాకు సూచించారు. నిమజ్జనం పూర్తయినప్పటికీ శబ్ద కాలుష్యం మాత్రం ఆగడం లేదు. అర్ధరాత్రి వరకు ఉంటున్న అధిక శబ్దాల కారణంగా అపార్ట్‌మెంట్‌లోని వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్యకు పరిష్కారం లభించలేదు. శబ్ద కాలుష్య నిబంధనలని పరిశీలించి, రాత్రి వేళల్లో ఇలాంటి శబ్దాలతో ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులను కోరుతున్నా' అని శిరీష్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

శిరీష్ కెరీర్ విషయానికొస్తే.. 'గౌరవం' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తర్వాత చాలానే సినిమాలు చేశాడు గానీ 'శ్రీరస్తు శుభమస్తు' లాంటి ఒకటి రెండు మూవీస్ తప్పితే చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. చివరగా 'బడ్డీ'లో కనిపించాడు. ఈ ఏడాది మార్చిలో నయనిక రెడ్డిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement