తమిళ నటి గీత కైలాసం ప్రధాన పాత్రను పోషించిన చిత్రం అంగమ్మాల్. చరణ్, భరణి, ముల్లైయరసీ, తెండ్రల్ రఘునాథన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంస్థ సమర్పణలో ఎంజాయ్ ఫిలిమ్స్, ఫిరో మూవీ స్టేషన్ సంస్థల అధినేతలు ఫిరో రహీం, ఎంజాయ్ సామ్యువేల్ కలిసి నిర్మించారు. దీనికి విపిన్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు. రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన కొడిమణి అనే కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 21న తెరపైకి రానుంది.
ఓటీటీలో కాకుండా థియేటర్‌లో..
ఈ క్రమంలో దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. సత్యమంగళం అటవీ ప్రాంతంలో చిత్ర షూటింగ్ పూర్తి చేశామన్నారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రను గీత కైలాసం పోషించారని, ఆమె ఈ పాత్రలో ఒదిగిపోయారని ప్రశంసించారు. చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లోనే విడుదల చేయాలన్న భావనతో.. అన్ని వర్గాల వారికి చేరాలన్న ఉద్దేశంతో జనరంజకంగా రూపొందించినట్లు చెప్పారు.
అవార్డు వస్తే సంతోషం
గీత కైలాసం మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తన పాత్ర కొత్తగా ఉందనిపించి నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు తనకు జాతీయ అవార్డు వస్తుందని అన్నారని, అలాంటి అవార్డు వస్తే తనకు చాలా సంతోషమేనని అన్నారు. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న సంస్థ అధినేతల్లో ఒకరైన సంతానం కార్తికేయన్ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంగమ్మాల్ చిత్రం జనరంజకంగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
చదవండి: 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకపోతే.. 'ఆప్ జైసా కోయి' చూసేయండి!


