‘ఆదర్శ కుటుంబం’తో సెంచరీ కొడతాం : వెంకటేశ్‌ | Aadarsha Kutumbam Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

‘ఆదర్శ కుటుంబం’తో సెంచరీ కొడతాం : వెంకటేశ్‌

Oct 28 2026 11:07 AM | Updated on Oct 28 2026 11:16 AM

Aadarsha Kutumbam Movie Pre Release Event Highlights

‘‘ఏం జరిగినా నా ఫ్యామిలీతోనే ఉంటాను. కాపాడుకుంటాను... అదే ‘ఆదర్శ కుటుంబం’  కథాంశం. నా సినిమాలను కుటుంబంతో కలిసి వచ్చి ఆదరించారు... అలాగే ‘ఆదర్శ కుటుంబం’నీ ఆదరించాలని కోరుకుంటున్నా. ఉప్పల్‌ స్టేడియంలో మన క్రికెటర్లు సిక్సర్లు కొడుతున్నారు. ‘ఆదర్శ కుటుంబం’తో స్టేడియం బయట మనం సిక్సర్లు కొడతాం, సెంచరీలు కొడతాం’’ అని హీరో వెంకటేశ్‌ తెలిపారు. 

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం ‘హౌస్‌ నెం: 47’. శ్రీనిధీ శెట్టి, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. మంగళవారం జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘కామెడీతో పాటు థ్రిల్, సస్పెన్స్‌... ఇలా అన్ని భావోద్వేగాలతో ఒక అద్భుతమైన కథను త్రివిక్రమ్‌ తీసుకు రావడంతో సంతోషపడ్డాను. ‘రాజా, సూర్యవంశం, వసంతం’ వంటి ఫ్యామిలీ సినిమాలు చాలా చేశాను. ‘ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా’ అన్నాను. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ అంటున్నాను.  ఇలాంటి అద్భుతమైన కథని ఎంచుకున్నందుకు చినబాబు, వంశీలకు థ్యాంక్స్‌’’ అని తెలిపారు. 

(చదవండి: రామాయణ' ప్రీమియర్స్.. తొలి రివ్యూ)

త్రివిక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి ‘పవిత్రబంధం’ సినిమాతో రచయితగా నా ప్రయాణం మొదలుపెట్టాను. ‘పెళ్లి చేసుకుందాం’ మూవీ టైమ్‌లో నేనెవరో తెలియకపోయినప్పటికీ నన్ను ప్రోత్సహించారాయన. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ కథ చెప్పినప్పుడు ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. ఆ సినిమా నుంచి నా కెరీర్‌ మలుపు తిరిగింది.. ‘ఆదర్శ కుటుంబం’కి కూడా అదే ప్రోత్సాహం అందించారు. ఒక సామాన్యుడు తెగిస్తే ఎంతవరకు వెళతాడన్నదే ఈ చిత్రకథ. 

నేను కుటుంబ విలువలను, కథలను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ వెంకటేశ్‌గారు. ఫ్యామిలీ మూవీస్‌తో స్టార్‌ హీరో కావొచ్చని నిరూపించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కరే’’ అని చెప్పారు. రామజోగయ్య శాస్త్రి, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement