మెరుగైన వైద్యం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం అందించాలి

Aug 2 2026 7:26 AM | Updated on Aug 2 2026 7:26 AM

మెరుగైన వైద్యం అందించాలి పీఎస్‌బీతో నేలకు జీవం జైలు భరోను జయప్రదం చేద్దాం

వెల్దుర్తి(తూప్రాన్‌): ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అనిల్‌ సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. వెల్దుర్తి, చేగుంట, మనోహరాబాద్‌, నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సూపర్‌వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, టీబీ సూపర్‌వైజర్లు, ఆర్‌బీఎస్‌కే బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతి, మాతా–శిశు ఆరోగ్య సేవలు, క్షయ వ్యాధి నిర్మూలన చర్యలు, సాధారణ వైద్య సేవలు, క్షేత్రస్థాయి పనితీరు, ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల సాధనపై సమగ్రంగా చర్చించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వసతి, నివాస గృహాల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ శిరీష, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌ రూరల్‌: రసాయన ఎరువులకు బదులు పీఎస్‌బీతో మంచి దిగుబడులు సాధించవచ్చని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ రవికుమార్‌ రైతులకు సూచించారు. శనివారం మండలంలోని అవంచలో మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీ విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా పీఎస్‌బీపై రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకంతో భూములు పాడవుతాయని వివరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్‌ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్స్‌ అమలు చేసిందన్నారు. కార్మికుల హక్కులను హరించే విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. 2025 విద్యుత్‌ సవరణ బిల్లు రద్దుతో పాటు విత్తన చట్టం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని కల్పించి, రోజువారీ వేతనం రూ.600 ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, సంతోశ్‌ తదితరులు పాల్గొన్నారు.

5 నుంచి ఫుట్‌బాల్‌ పోటీలు

జహీరాబాద్‌: ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు బాల బాలికలకు సుబ్రతో కప్‌ ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అండర్‌ 17 విభాగంలో బాలురు, బాలికలకు, అండర్‌–15 విభాగంలో బాలురకు మాత్రమే పోటీలు ఉంటాయన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న జట్లు మాత్రమే పోటీలో పాల్గొంటాయన్నారు. ఒక పాఠశాల నుంచి ఒక టీం మాత్రమే హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8125347198 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement