● అల్పాహారం సైతం అందజేత
● అమలుకు విద్యాశాఖ ఆదేశాలు
● కసరత్తు ప్రారంభించిన అధికారులు
మెదక్ అర్బన్: టీచర్లకు టిఫిన్.. మధ్యాహ్న భోజనం వర్తింపజేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే విద్యార్థులకు ఈ ఏడాది జూన్ 12 నుంచే అల్పాహారం ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ, రెండు నెలలు కావొస్తున్నా ఆచరణకు నోచుకోలేదు. నాణ్యమైన భోజనం, టిఫిన్, పాలు ఇస్తామని చెప్పారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు సైతం భోజనం, టిఫిన్‌కు అవకాశం కల్పిస్తే, వాటి నాణ్యత బాగుందన్న అభిప్రాయం సమాజంలోకి వెళ్తుందని, అందరూ సమానమనే భావన కూడా ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే పథకం ప్రారంభంపై స్పష్టత కరువైంది.
జిల్లాలో 4,300 మంది టీచర్లు
జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ తదితర స్కూళ్లు కలిపి మొత్తం 957 ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు 4,044 టీచర్ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 3,551 మంది పని చేస్తున్నారు. ఇతర పాఠశాలల్లో సిబ్బందితో కలిపి సుమారు 800 వరకు ఉండవచ్చు. అంటే మొత్తం మీద 4,300 మంది పని చేస్తున్నారు. వీరందరూ విద్యార్థులతో పాటు టిఫిన్, మధాహ్న భోజనం చేయాల్సి ఉంటుంది. రోజుకో రకం టిఫిన్‌లు ఇచ్చేలా మెనూ రూపొందించారు. ఇడ్లీ, బోండా, ఉప్మాతో పాటు కిచిడి, వెజ్ బిర్యానీ, పులిహోర, విజయ డెయిరీ పాలు, రాగి జావ ఇవ్వనున్నారు.
అల్పాహారం ఎప్పుడో?
ఈ విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న వంట ఏజెన్సీలతో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం అమలవుతుందా..? లేదా అనే సంశయంలో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రాల్లో హరేకృష్ణ ఛారిటీ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాటిని పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.


