ఖేడ్ మున్సిఫ్ కోర్టు జడ్జి హిమబిందు
కంగ్టి(నారాయణఖేడ్): విద్యార్థులు చట్టాలు తెలుసుకొని న్యాయ వ్యవస్థపై గౌరవంగా ఉండాలని నారాయణఖేడ్ మున్సిఫ్ కోర్టు జడ్జి హిమబిందు తెలిపారు. శనివారం కంగ్టిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో లీగల్ సర్విస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుంచే విద్యార్థులకు చట్టాలు, న్యాయాల విషయంలో అవగాహన ఏర్పడితే పెద్దయ్యాక క్రమశిక్షణతో కూడిన జీవనం గడిపే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం గురుకులంలోని స్టోర్ రూంను పరిశీలించి విద్యార్థుల కోసం నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలు, పప్పులు తదితరాలు పరిశీలించారు. నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


