● అధిష్టానం వర్సెస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి
● తూప్రాన్, మనోహరాబాద్ పార్టీ అధ్యక్షుల నియామకంలో రచ్చ
● పీసీసీని కాదని, తన వర్గానికి కేటాయించిన నర్సారెడ్డి
మెదక్‌జోన్: అధికార కాంగ్రెస్‌లో ధిక్కార స్వ రం మొదలైంది. తనను కాదని ఎలా నియామకాలు చేపడతారంటూ గజ్వేల్ పార్టీ ఇన్‌చార్జి నర్సారెడ్డి తిరుగుబాటు చేశారు.
జిల్లా పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. కాగా, ఇటీవల కాంగ్రెస్ మండల, పట్టణ పార్టీ కమిటీలను నియమించింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో దీనిపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఓ నామినేటెడ్ పదవి విషయంలో తమకు అన్యాయం జరిగిందని తూప్రాన్‌కు చెందిన కొందరు సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రెండు మండలాల్లో బలమైన నేతలను నియమించాలనే ఉద్దేశంతో ఈనెల 10న తూప్రాన్ పట్టణ అధ్యక్షుడిగా నర్సింగరావు, మనోహరాబాద్ మండల అధ్యక్షుడిగా మల్లారెడ్డిని నియమిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నియామకాలను వ్యతిరేకించిన నర్సారెడ్డి తనను సంప్రదించకుండా పార్టీ పదవులు ఎలా కట్టబెడతారని సమావేశం ఏర్పాటు చేసి తూప్రాన్ మండల అధ్యక్షుడిగా మల్లేశ్, పట్టణ అధ్యక్షుడిగా చిన్న భగవాన్‌రెడ్డి, మనోహరబాద్ మండల అధ్యక్షుడిగా ఆంజనేయులుగౌడ్‌ను నియమించారు.
గతంలోనూ విభేదాలు
అప్పట్లో సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడి నియామకంలోనూ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. నర్సారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి కలిసి మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి (పీటీ) సర్పంచ్ మన్నె కళ్యాణ్‌ను ఫోరం జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఆ మరుసటి రోజే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఆవుల గోపాల్‌రెడ్డిని ఫోరం జిల్లా అధ్యక్షుడిగా నియమించి నియామకపత్రం అందించారు.
అయోమయంలో కేడర్
పోటాపోటీగా నియామకాలు చేపట్టడంతో పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఏకంగా పీసీసీ అధ్యక్షుడిని సవాల్ చేస్తూ తన అనుచరులకు పార్టీ పదవులు కట్టబెట్టడం, డీసీసీ అధ్యక్షుడిని కాదని జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడి నియామకం చేపట్టడంతో జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది. స్టేట్‌లో పీసీసీ, జిల్లాలో డీసీసీ అధ్యక్షులు చీఫ్‌గా వ్యవహరిస్తారు. వారిని కాదని సొంత నిర్ణయాలు తీసుకోవటం పార్టీ ధిక్కారమే అవుతుందని పలువురు నేతలు వాపోతున్నారు.


