త్వరలో పాదయాత్ర చేపడతా.. ‘బసవేశ్వర, సంగమేశ్వర’ పనులపై ఎమ్మెల్యే హరీశ్
నారాయణఖేడ్: జిల్లాలోని బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పనులు చేపట్టాలన్న డిమాండ్‌తో త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఖేడ్‌లో సోమవారం సర్, బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి ప్రజలతో కలిసి పాదయాత్ర ప్రారంభిస్తానని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాలం కాకపోయినా నారాయణఖేడ్, జహీరాబాదు, అందోలు నియోజకవర్గాల్లో పంటలు పండాలని కేసీఆర్ ఆయా ఎత్తిపోతల పథకాలకు ఖేడ్‌లోనే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. సింగూరుకు మరమ్మతులు చేయాలని నీటిని ఖాళీచేసి ఇంతవరకు మరమ్మతులు పూర్తి చేయలేదన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లు ఫారాలను నింపి ఇవ్వకుంటే ఓట్లు గల్లంతైనట్లేనని అన్నారు. సంగారెడ్డి, జహీరాబాదు ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్‌రావు, మెదక్ జిల్లా సభ్యత్వ నమోదు సమన్వయకర్త శశిధర్‌రెడ్డి, మాజీ డీసీఎంఎస్ అధ్యక్షుడు శివకుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ, రాష్ట్ర నాయకులు మొహిద్‌ఖాన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు
ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పోలీసులు తమ పని తాము చేయకపోవడం వల్లే షాబాద్‌లో సైకో రాజ్ కుమార్ ఆరుగురిని చంపాడన్నారు. పోక్సో కేసు నమోదైన 45 రోజుల పాటు అరెస్ట్ కాకుండా సీఎం సన్నిహితుడు రూ.20 లక్షలు తీసుకుని కాపాడినందునే హత్యలకు తెగబడ్డాడని ఆరోపించారు.


