రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలమై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. స్వాహా అయిన నిధులు రికవరీ చేసి చర్యలు తీసుకోవాలన్నా రు. రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసగించాయని ఆరోపించారు. 11వ వార్డులో ఏటా వర్షాకాలంలో ఇళ్లు నీటి ముంపునకు గురవుతున్నాయని, ఈసమస్యను అరికట్టాలన్నారు. ఈమేరకు సిద్దిపేట రోడ్డులో బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి తండాకు తారు రోడ్డు నిర్మాణం కోసం ఏడాది క్రితం కంకర పోసి వదిలేశారని, దీంతో తండావాసులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. పట్టణంలో నెలకొన్న సమస్యల విషయమై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, పట్టణాధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, కౌన్సిలర్ శంకర్‌గౌడ్, జిల్లా ప్రదాన కార్యదర్శి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్, అనిల్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు చింతల శేఖర్, పబ్బ సత్యం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


