కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: నులిపురుగుల నివారణతో బాలలకు పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు మాత్రలు వేయించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. సోమవారం మెదక్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి మాట్లాడారు. చేతుల శుభ్రత వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చుని తెలిపారు. మట్టిలో ఆడుకోవడం వల్ల పిల్లలకు నులిపురుగులు ఏర్పడుతాయన్నారు. ఫలితంగా బలహీనత, రక్తహీనత, పోషకాహారలోపం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయన్నారు. డీఎంహెచ్‌ఓ గణేశ్వర్ మాట్లాడుతూ.. ఆల్బెండజోల్ మాత్రలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. అందుబాటులో నిపుణులైన పిల్లల వైద్యులు సేవలు అందిస్తున్నారని, మాత్రలు వేసుకోని పిల్లల కోసం ఈనెల 20వ మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం ప్ర పంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్న పలు కుటుంబాలను కలెక్టర్ సన్మానించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి జయశ్రీ, మెడికల్ అధికారి సాయిగౌతం, ప్రదీప్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


