'సమయంలేదు మిత్రమా..' ఇంకా కొన్ని రోజులే! | - | Sakshi
Sakshi News home page

'సమయంలేదు మిత్రమా..' ఇంకా కొన్ని రోజులే!

Published Thu, Nov 23 2023 4:38 AM | Last Updated on Thu, Nov 23 2023 9:55 AM

- - Sakshi

సాక్షి, మెదక్‌: రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడు రోజులే గడువు ఉంది. అయితే 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలి దీంతో ఇంకా మిగిలింది ఐదు రోజులు మాత్రమే. అంటే బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ ఒక ఎత్తు కాగా ఈ ఐదు రోజుల మరో ఎత్తుగా అభ్యర్థులు భావిస్తున్నారు. అందులో భాగంగా వారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే ప్రతిరోజూ ప్రణాళికాబద్ధంగా విజయం కోసం ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎక్కడెక్కడ బలహీనత ఉంది దానిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎక్కడ ఎవరిని తమ పార్టీలో చేర్చుకోవాలి అనే పథకాలు రచించి అమలు చేస్తున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను దెబ్బతీస్తూ విజయాన్ని సాధించేలా ప్రతి వ్యూహాలు కూడా రూపొందిస్తున్నారు. ప్రచారంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ఈ చివరి వారంలో భారీ సభల నిర్వహణకు కూడా ప్లాన్‌ చేసుకుంటున్నాయి.

ఈ ఐదురోజులు చాలా కీలకం!
ఎన్నికల పర్వంలో కీలకమైన ప్రచార ఘట్టానికి కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలింది. ప్రచారానికి 28 సాయంత్రం 5 గంటలకు గడువు పూర్తవుతుంది. ఈ క్రమంలో జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌ నియోజక వర్గాల్లో మూడు ప్రధాన పార్టీలు తమ జోరును పెంచాయి. కొంత మంది అభ్యర్థులు ఈ ఐదు రోజులు చాలా కీలకంగా వ్యవహరించాలని పథకం రచించారు. ఏరోజు ఏం చేయాలి. ఎవరు ఏ బాధ్యత చేపట్టాలనే కార్యక్రమాల గురించి పక్కాగా నిర్ణయించుకున్నారు.

ఆయా రోజుల్లో చేయాల్సిన పనులను వాట్సప్‌ ద్వారా తమ అనుచరులకు పంపిస్తున్నారు. ప్రధానంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారాన్ని పదునెక్కించే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ తాము బలహీనంగా ఉన్నామనే సమాచారాన్ని ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బృందాల ద్వారా తెలుసుకున్న అభ్యర్థులు వాటిపై దృష్టిపెట్టారు. ఈ ఐదురోజుల్లో ఎంతగా ప్రజల్లోకి వెళ్తే.. ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకోగలిగితే అంతగా విజయావకాశాలు పెరుగుతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రతిక్షణం జనంతోనే ఉంటున్నారు.

గంపగుత్త ఓట్ల కోసం..
మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌, మెదక్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారానికి ఐదు రోజులు మిగలడంతో ఒకేసారి గంపగుత్తగా వందల మంది ఓటర్లను తమవైపు ఎలా తిప్పుకోవాలనే వ్యూహాలను రచిస్తున్నారు. అందులో భాగంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, వైద్యులు, యువజన సంఘాలు, వివిధ కమిటీలతో చర్చలు నిర్వహిస్తున్నారు.

గ్రామాలు, వార్డుల వారీగా కులసంఘాలకు ఆలయాలు, కమ్యూనిటీ భవనాలకు నిధులు సమకూరుస్తామనే హామీలు గుప్పిస్తున్నట్టు సమాచారం. అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటుండగా, వారి అనుచరులు, నాయకులు గంపగుత్త ఓటర్ల కోసం జోరుగా చర్చలు సాగిస్తున్నారని, వారికి కావాల్సినవి సమకూర్చుతూ తమవైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నట్టు పలువురు చెప్పుకుంటున్నారు.

పోటా పోటీ.. మీటింగ్‌లు!
రెండు నియోజకవర్గాల్లో పధ్రాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే మెదక్‌, నర్సాపూర్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే మెదక్‌లో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొని తమ మెదక్‌, నర్సాపూర్‌ అభ్యర్థులు డాక్టర్‌ మైనంపల్లి రోహిత్‌రావు, రాజిరెడ్డిని గెలిపించాలని కోరారు.

అలాగే నర్సాపూర్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అనంతరం మెదక్‌ ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎంపీ విజయశాంతి, మైనంపల్లి హన్మంతరావు తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అలాగే బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రధాని మోదీ పాల్గొంటారని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ, లేదా ప్రియాంక గాంధీలు సైతం మెదక్‌, నర్సాపూర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు కూడా చెబుతున్నారు.
ఇవి చదవండి: కాలినడక నుంచి.. హెలీకాప్టర్ల వరకు.. ఎన్నికల ప్రచారంలో మార్పులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement