నిర్భయంగా ఓటు వేయండి
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని అదనపు ఎస్పీ మహేందర్ పిలుపునిచ్చారు. సోమవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా పట్టణంలోని వెస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోడల్ డే కేర్ సెంటర్ పోలింగ్ కేంద్రాన్ని, అలాగే దయరా, నవాబ్‌పేట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సీఐ మహేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
అదనపు ఎస్పీ మహేందర్


