● మున్సిపల్ ఎన్నికల ఖర్చులు చెప్పని 22 మంది అభ్యర్థులు
● ఇప్పటికే ముగిసిన గడువు
మెదక్ కలెక్టరేట్: ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లో వ్యయానికి సంబంధించిన ఖర్చుల వివరాలు అధికారులకు అందజేయాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నిక రద్దు చేస్తామని ప్రకటించింది. ఇందుకు మార్చి 29 డెడ్‌లైన్ విధించింది. అయితే గడువు ముగిసి వారం రోజులవుతున్నా, మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన 22 మంది అభ్యర్థులు వివరాలు సమర్పించలేదు. బల్దియా పరిధిలో మొత్తం 32 వార్డుల్లో 113 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 91 మంది తమ ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలు అధికారులకు అందించారు. మిగితా వారు ఇవ్వమంటూ తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ‘ఏ లెక్కలు చెప్పాలి.. చెప్పకుంటే ఏమవుతుంది. మూడేళ్ల ఎన్నికల బహిష్కరణ ఉంటుందంటే.. ఇక ముందు మేం ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయం’. అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు. మరి వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
రూ. 50 వేల లోపే..!
ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు, ఓడిన వారు కొంతమంది ఎన్నికల ప్రచార లెక్కలు అధికారులకు సమర్పించారు. వీరు కేవలం రూ. 20 వేల నుంచి 50 వేల వరకు మాత్రమే ఖర్చు చేసినట్లు చూపించారు. మరి ఎన్నికల సమయంలో వార్డుల్లో ఏరులై పారిన మద్యం, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి ప్రతిరోజు ఇంటింటి ప్రచారంలో కనీసం 50 మందికి తగ్గకుండా వెంట తిప్పుకున్నారు. రోజుకు ఒక్కొక్కరికి రూ.300లతో పాటు మధ్యాహ్న భోజనం, పురుషులకు సాయంత్రం మందు, బిర్యాని అందించారు. ఇలా ఒక అభ్యర్థి రోజుకు కనీసం రూ.50 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం.


