మెతుకుసీమలో రాజకీయ అండతో పేట్రేగిపోయిన ఇసుక మాఫియా పీచమణిచి.. అక్రమార్కులకు చుక్కలు చూపుతున్నారు కలెక్టర్ ప్రతిమాసింగ్. నెల రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా వందలాది అక్రమ ఇసుక డంపులను సీజ్ చేయించారు. ‘ఇందిరమ్మ ఇళ్లకు మన ఇసుక వాహనం’ పేరిట ప్రారంభించిన వినూత్న పథకంతో లబ్ధిదారులకు ఉచిత ఇసుక ఇస్తూ అండగా నిలుస్తున్నారు. జిల్లాలో మెదక్, హవేళిఘణాపూర్, కొల్చారం మండలాల్లోని వాగుల్లో మూడు ఇసుక పాయింట్లను గుర్తించి, ఆన్‌లైన్ బుకింగ్‌తో సరఫరా చేసేందుకు కొత్త పథకానికి రూపకల్పన చేశారు. – మెదక్ అర్బన్
ఇందిరమ్మ, సొంత ఇళ్లు, ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేందుకు ‘మన ఇసుక వాహనం’ అనే పథకానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. అవసరమైన వారు ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ముందుగా టీజీఎంఐవీ యాప్‌లోకి వెళ్లాలి. మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఓటీపీ వస్తుంది. అనంతరం వ్యక్తి గత వివరాలు, ఆధార్ నంబర్ అప్‌లోడ్ చేయాలి. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైతే వాటి వివరాలు ఎంట్రీ చేయాలి. అవసరమైన ఇసుకకు సంబంధించి నిబంధనలకనుగుణంగా ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లించాలి. ఇది సంబంధిత పంచాయతీ కార్యదర్శి లాగిన్‌లోకి వెళ్తుంది. అక్కడ వివరాలు, నిర్ధారిత పత్రాలు సరి చూసుకొని అతడు తహసీల్దార్ లాగిన్‌లోకి ప్రతిపాదనలు పంపుతారు. అక్కడ ఎమ్మార్వో అన్ని ఆధారాలు సరి చూసుకొని, ఫైనల్ అప్రూవల్ ఇస్తాడు. అప్పుడు డిజిటల్ కూపన్ జనరేట్ అవుతుంది. దానిని తీసుకొని అలాట్ అయిన రీచ్‌కు వెళ్తే, అక్కడ ఉన్న సాండ్ రీచ్ ఆఫీసర్ సిటిజన్ డిజిటల్ కూపన్, టీపీల ను నిర్ధారించుకొని ఇసుక రవాణకు అనుమతి ఇస్తారు. ఇంటి నిర్మాణానికి అనుగుణంగా అవసరమైనంత ఇసుక సరఫరా చేస్తారు.
ఇందిరమ్మకు మన ఇసుక వాహనం
ఫోన్ ద్వారా ఉచితంగా బుకింగ్
జిల్లాలో మూడు చోట్ల పాయింట్లు
అక్రమార్కుల పీచమణిచిన కలెక్టర్
ఇసుక రీచ్‌లలో ఇందిరమ్మ, సొంత ఇళ్లు, ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేస్తారు. అయితే ట్రాక్టర్ల లెక్కన ఇసుక విక్రయిస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు దాదాపు ఉచిత ఇసుక పంపిణీ చేసే అవకాశం ఉందని, పూర్తి వివరాలు అందాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. సాధారణంగా ఇందిరమ్మ ఇళ్లకు ఆన్‌లైన్ చార్జి రూ.12, ఇసుక లోడింగ్ చార్జి రూ.400, సంబంధిత గ్రాామానికి విలేజ్ ఫండ్ రూ.200గా నిర్ధారించే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారు సొంతగా ట్రాక్టర్, లేబర్‌ను తీసుకెళ్తే దాదాపు ఉచితంగా ఇసుక సరఫరా అయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై రెండు, మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పాపన్నపేట తహసీల్దార్ సతీష్ తెలిపారు. ఇక వ్యక్తిగత ఇళ్లు, ప్రభుత్వ పనులకై తే ట్రాక్టర్ ఇసుకకు రూ.1173 చెల్లించే అవకాశం ఉందన్నారు.


