‘పుర’ ప్రచారానికి తెర
మెదక్‌జోన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్దిరోజులుగా గల్లీల్లో వినిపించిన మైకుల హోరు, పార్టీల ప్రచార జోరుకు తెరపడింది. పోలింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ అయింది. ఆఖరి రోజు సోమవారం అన్ని పార్టీల ముఖ్య నేతలు రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లతో ఓటర్లను ఆకట్టుకున్నారు. జిల్లాలో మెదక్, రామా యంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వీటి పరిధిలో 75 వార్డులు ఉన్నాయి. ఇందులో మెదక్ పట్టణంలో ఒక వార్డు ఏకగ్రీవం అయింది. ఇక మిగిలిన 74 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఆరు రోజులుగా అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక పార్టీపై మరో పార్టీ నేతలు విమర్శలు గుప్పించుకున్నారు.
జోరుగా డబ్బుల పంపిణీ
బల్దియా ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాలకు తెరలేపారు. డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు షురూ చేశారు. ప్రధానంగా మెదక్ మున్ని పాలిటీలో డబ్బుల పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులకు వచ్చిన నిధులతో పాటు కొంత వారు కలిపి పంచుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని 5 వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ. 4 నుంచి రూ. 5 వేల చొప్పున పంపి ణీ చేసినట్లు సమాచారం. వాటిలో ప్రత్యర్థి అభ్యర్థులను ఓడించటమే లక్ష్యంగా ఆయా పార్టీలకు అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు తెలిసింది. ఎంత డబ్బు ఖర్చు అయినా ఫర్వాలేదు.. కానీ ఆ వార్డులో ప్రత్యర్థి ఓడిపోవాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. డబ్బుల పంపిణీలో కేవలం కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధువులకు ఇచ్చి నేరుగా ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుడా ఫోన్‌లలో సైతం రహస్య విషయాలు మాట్లాడటం లేదు. ఎందుకంటే ప్రత్యర్థులు రికార్డు చేసి బహిర్గతం చేస్తారనే భయంలో అభ్యర్థులు కనీసం వారి నీడను కూడా నమ్మకుండా జాగ్రత్తలు పడుతున్నారు. జిల్లాలోని 74 వార్డుల్లో ఇదే పరిస్థితి ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.
పట్టణాల్లో ప్రలోభాల ఎర
జిల్లాలో 4 మున్సిపాలిటీలు
74 వార్డు స్థానాలు
రేపే పోలింగ్
‘పుర’ ప్రచారానికి తెర


