కాలినడక నుంచి.. హెలీకాప్టర్ల వరకు.. ఎన్నికల ప్రచారంలో మార్పులు! | Sakshi
Sakshi News home page

కాలినడక నుంచి.. హెలీకాప్టర్ల వరకు.. ఎన్నికల ప్రచారంలో మార్పులు!

Published Thu, Nov 23 2023 1:00 AM

- - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎన్నికల ప్రచారంలో ప్రతిసారి వినూత్న మార్పులు కనిపిస్తున్నాయి. నాడు అభ్యర్థులు కాలినడకన గ్రామాలను చుట్టేసేవారు. ఆ తర్వాత ఎడ్లబండ్లు, సైకిళ్లు, మహా అయితే జీపుల్లో గ్రామాలు, పట్టణాల్లో అభ్యర్థులు తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టేవారు. రానురాను జీపుల వినియోగం పెరిగింది. అనంతరం అంబాసిడర్‌ కార్లు వచ్చాయి. ప్రస్తుతం ఖరీదైన కార్లు, ఇతర వాహనాలను ప్రచారాలకు ఉపయోగిస్తున్నారు.

పల్లెల్లో వాహనాల బారులు..
జిల్లాలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి అధునాతన వాహనాలనే వినియోగిస్తున్నారు. పల్లెల్లో ఖరీదైన కార్లు బారులు తీరుతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా అభ్యర్థి వెంట పదుల సంఖ్యలో కార్లు కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లో ముఖ్య అనుచరులు వెళ్లి బలగాన్ని చూపుతూ ప్రజలకు చేరువవుతున్నారు.

ప్రముఖులు ఆకాశమార్గాన..
పార్టీ అధ్యక్షులు, ప్రముఖులైతే సభలకు హెకలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. వంద కిలోమీటర్ల దూరంలో సభలు ఉంటే కార్లలో వెళ్తే సమయానికి చేరుకునే అవకాశం ఉండదు. తక్కువ సమయంలో ఎక్కువ సభలను చుట్టేసేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల అధ్యక్షులు, ప్రముఖులు హెలికాప్టర్లను వాడుతున్నారు. రోజూ మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. నాడు ఎంత పెద్ద సభ అయినా వాహనాల్లో వెళ్లేవారు. నేడు క్షణాల్లో ఆకాశమార్గాన సభల ముందు వాలిపోతున్నారు.

చెట్లనీడ పోయి.. షామియానాలొచ్చే!
తొలినాళ్లలో చెట్లకింద, రచ్చబండల వద్ద పగలు సభలు, సమావేశాలు నిర్వహించేవారు. విశాలమైన మైదానాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేవారు కాదు. నియోజకవర్గానికి సంబంధించిన సభలు, సమావేశాలను గ్రామశివారులోని మర్రిచెట్లు, ఇతర వృక్షాల కిందనే ఏర్పాట్లు చేసుకునేవారు. నేలపైనే కూర్చొని ప్రజలు నేతల ప్రసంగాలు వినేవారు. టెంట్లు ఉండేవి కావు. నాటి పరిస్థితులకు భిన్నంగా ప్రస్తుతం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పెద్ద మైదానాల్లో షామియనాలు(టెంట్లు) ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సభ సమయంలోనూ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం సాయంత్రం 4గంటలకు సభలు నిర్వహిస్తున్నారు. రాత్రి వెలుగులు పంచడానికి ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా ప్రచార పాటలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ప్రచార పాటల్లోనూ మార్పులు వచ్చాయి. గతంలో కళాకారులు అప్పటికప్పుడు డప్పు చపుళ్లతో పాటలు పాడేవారు.

ప్రతి పార్టీకి కళాకారుల బృందం ఉండేది. అభ్యర్థులు గ్రామానికి చేరుకునే గంట, రెండు గంటల ముందు కళాకారులు వచ్చి తమ పాటలో ఉత్సాహపరిచేవారు. నేడు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ రికార్డింగ్‌ పాటలతో ప్రత్యేక రథాలను గ్రామాలు, పట్టణాల్లోని వీధుల్లో తిప్పుతున్నారు. అభ్యర్థి సేవలు, చేపట్టిన అభివృద్ధిపై రికార్డు చేసిన పాటలతో హోరెత్తిస్తున్నారు. కొందరు నాయకులు ఎల్‌ఈడీ స్క్రీన్‌ వాహనాల ద్వారా నేతల ప్రసంగాలను వినిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: 'బర్రెలక్క' తమ్ముడిపై దాడి..! ఓట్లు చీల్చుతుందనే భయంతోనే ఇలా..

Advertisement
 
Advertisement