మెదక్: అప్పటి వరకు సరదాగా మాట్లాడుకుంటూ బట్టలు ఉతుకుతున్న వారి పాలిట చెరువు యమకూపంగా మారింది. ముగ్గురు మహిళలు మృత్యువాత పడగా, బాలుడు గల్లంతయ్యాడు. మరో మహిళ ప్రాణాలతో బయట పడింది. ఈ విషాదకర ఘటన మనోహరాబాద్ మండలం రంగాయపల్లి చెరువు వద్ద సోమవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రంగాయపల్లికి చెందిన ఫిరంగి చంద్రయ్య, లక్ష్మికి కూతురు లావణ్య (23), ఇద్దరు కుమారులున్నారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగకు లక్ష్మి తన సోదరులు కుటుంబాలను ఆహ్వానించింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేట్‌కు చెందిన దుడ్డు యాదగిరి, శ్రీకాంత్ డ్రైవర్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అక్క లక్ష్మి ఆహ్వానంతో యాదగిరి భార్య బాలమణి (30), శ్రీకాంత్ భార్య లక్ష్మి(25), పిల్లలతో కలసి పండుగకు వచ్చారు.
బట్టలు ఉతికేందుకు వెళ్లి..
సోమవారం మధ్యాహ్నం బట్టలు ఉతికేందుకు ఫిరంగి లక్షి, తన కూతురు లావణ్య(23), మరదళ్లు బాలమణి, లక్ష్మిని తీసుకొని చెరువు వద్దకు వెళ్లింది. వీరి వెంట బాలమణి, యాదగిరి కుమారుడు చరణ్(10) కూడా వచ్చాడు. ఈ క్రమంలో చరణ్ ఆడుకుంటూ నీటిలో మునిగిపోయాడు. గమనించిన తల్లి బాలమణి కాపాడేందుకు ప్రయత్నించి అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది. ఆమెను కాపాడేందుకు లావణ్య, లక్ష్మి ఒకరివెంట ఒకరు వెళ్లి నీటమునిగారు. పక్కనే ఉన్న ఫిరంగి లక్ష్మి కాపాడండి అంటూ కేకలు వేస్తూ.. నీళ్లలోకి దిగింది.
ఈ క్రమంలో లక్ష్మి కూడా నీటమునిగింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ యువకుడు స్పందించి నీటిలో మునిగిపోతున్న లక్ష్మిని బయటకు లాగి నీటిని కక్కించడంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకొని బాలమణి, లక్ష్మి, లావణ్యల మృతదేహాలను బయటకు తీశారు. తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ నాగభూషణం, తూప్రాన్ పీఎసీఎస్ చైర్మన్ బాలకృష్ణరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్ట్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు, చరణ్ మృతదేహం కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.
బాధితులకు వంటేరు పరామర్శ
చెరువులో జేసీబీ గుంతలే నలుగురి మృతికి కారణమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. తమ వాళ్లు లేరన్న విషయం జీర్ణించుకోలేక గుండెలు బాదుకుంటూ... దేవుడా ఎంత పని చేస్తివి... మా వాళ్ళను తీసికెళ్లిపోతివా.. అంటూ కన్నీరు పెట్టడం అక్కడున్న ప్రతీ ఒక్కరిని కదిలించింది. ఘటనతో మూడు కుంటుంబాల్లో విషాదం అలుముకుంది. పండుగ కోసం ఆడబిడ్డ ఇంటికి వెళ్లి మృత్యువాత పడడంతో అంబర్‌పేట్ గ్రామస్తులు రంగాయపల్లి చెరువు వద్దకు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


