అప్రమత్తతే శ్రీరామ రక్ష
మెదక్‌జోన్: చలికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్యం కాపాడుకోవచ్చని డీఎంహెచ్‌ఓ శ్రీరాం అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల జాగ్రత్తలు అవసరం అన్నారు. గురువారం ‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో భాగంగా ప్రజల సందేహాలను నివృత్తి చేసి, పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రశ్న: మా ఇంట్లో రెండేళ్ల బాబు ఉన్నాడు. చలి తీవ్రతతో జలుబు అధికంగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – కుమార్, తునికి
డీఎంహెచ్‌ఓ: వెంటనే దగ్గరలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం చేయించండి. చలిలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకెళ్లొద్దు. ఉన్ని దుస్తులు ధరించాలి.
మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వారికి దగ్గు, జలుబు, జ్వరం ఉంది. మా గ్రామంలోని ఆర్‌ఎంపీకి చూపించినా తగ్గలేదు. ఎలాంటి చర్యలు తీసుకోమంటారు?
– శ్రీనివాస్, పాపన్నపేట, జయపాల్, కొల్చారం, రంగంపేట
డీఎంహెచ్‌ఓ: మీ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లండి. వారికి వెంటనే యాంటీబయాటిక్ సిరప్‌లు వాడాల్సి ఉంటుంది. గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి.
ప్రశ్న: మా గ్రామ పాఠశాలలో చాలా మంది విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు మందులు ఇవ్వండి?
– శంకర్, పాఠశాల చైర్మన్,
చిన్నఘణాపూర్, కొల్చారం
డీఎంహెచ్‌ఓ: ఏఎన్‌ఎంను పంపి వెంటనే పాఠశాలలో విద్యార్థులను పరిశీలించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తాం. ఒకటి, రెండు రోజుల్లో క్యాంపు ఏర్పాటు చేస్తాం. ఆశవర్కర్ ప్రతి వెయ్యి మందికి ఒకరు చొప్పున ఉంటారు. మీ గ్రామంలో జనాభా ఆధారంగా తగు చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: మా మండలంలో పీహెచ్‌సీ లేదు. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్దకు పరుగు పెట్టాల్సి వస్తుంది.
– శ్రీనివాస్, చండూరు సర్పంచ్
డీఎంహెచ్‌ఓ: చిలప్‌చెడ్ మండల కేంద్రానికి అర్బన్ ఆరోగ్య కేంద్రం మంజూరైంది. ఇందుకోసం నిధులు సైతం విడుదలయ్యాయి. త్వరలోనే భవన నిర్మాణం చేపడుతాం. ప్రస్తుతం మండల ప్రజలు కౌడిపల్లి పీహెచ్‌సీకి వెళ్లి వైద్యం చేయించుకోవాలి. ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు చూపించొద్దు. ఎందుకంటే వారు అధికంగా యాంటీబయాటిక్ ఇస్తారు. అది ఆరోగ్యంపై భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం చూపుతుంది.
ప్రశ్న: మా బాబు వయస్సు 19 సంవత్సరాలు. మెదక్‌లో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. వారం రోజులుగా చలికి చేతులు వంకర పోతున్నాయని అంటున్నాడు.
– శ్రీనివాస్, గాజిరెడ్డిపల్లి
డీఎంహెచ్‌ఓ: మీబాబు హాస్టల్లో చలి నీటిలో స్నా నం చేయటం, చలిలో బయటకు వెళ్లటం జరిగి ఉంటుంది. అందుకే చేతులు వంకరపోతున్నాయనిపిస్తోంది. జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి చిన్నపిల్లల వైద్యుడికి చూపించి తగు మందులు వాడండి.
ప్రశ్న: నా వయస్సు 48 సంవత్సరాలు. 15 రోజులుగా తరుచూ జ్వరం, దగ్గు, జలుబు వస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?
– రాజేశ్వర్, చిన్నశంకరంపేట
డీఎంహెచ్‌ఓ: తరుచుగా జలుబు, దగ్గు, జ్వరం వస్తుందంటున్నారు కాబట్టి మీ మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వెళ్లి బీపీ, షుగర్‌తో పాటు (సీబీపీ) రక్త పరీక్షలు చేసుకోవాలి.
ప్రశ్న: నాకు కుక్క కరిచింది. మా మండల కేంద్రంలోని పల్లె దవాఖానకు వెళ్తే అక్కడ పనిచేసే వారు కనీసం పట్టించుకోలేదు. దీంతో సిద్దిపేట వెళ్లి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.
– శ్రీనివాస్, నిజాంపేట
డీఎంహెచ్‌ఓ: డీఎంహెచ్‌ఓ: విచారణ జరిపించి చర్యలు తీసుకుంటా. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. మీరు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయండి
ప్రశ్న: ఆరేళ్ల క్రితం స్టంట్ వేశారు. చలితో దగ్గు, జలుబు అయింది. ఎలాంటి జాగ్రతలు పాటించాలి? – సాయిరాం, చేగుంట
డీఎంహెచ్‌ఓ: చలికి స్టంట్ పడిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చలికి ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకూడదు. ఉన్ని దుస్తులు ధరించాలి. వేడి పదార్థాలు మాత్రమే తినాలి. వెంటనే మీ మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వెళ్లి సీబీపీ రక్త పరీక్షలు చేయించుకొండి. దానిని బట్టి మందులు వాడితే తగ్గుతుంది.
చలితో జలుబు, జ్వరం బారిన పడే ప్రమాదం
వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు అవసరం
డీఎంహెచ్‌ఓ శ్రీరాం
సాక్షి ఫోన్ ఇన్‌కు విశేష స్పందన


