యూరియా.. ఏదయా!
ఎకరాకు 2.5 బస్తాలు
● జిల్లాలో 3.17 లక్షల ఎకరాల్లో సాగు
● 27 వేల పైచిలుకు మెట్రిక్ టన్నులు అవసరం
యాసంగి సాగు ప్రారంభంలోనే అన్నదాతకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఎరువుల దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. పోలీస్ పహారాలో పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో 3.17 లక్షల ఎకరాలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 13 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 3,17,380 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో సింహభాగం వరి 2,95,200 ఎకరాలు సాగవుతుండగా, మిగితా 22,180 ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడుతో పాటు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకోసం డీఏపీ, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్‌తో పాటు అన్నిరకాల రసాయన ఎరువులు 56,523 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా యూరియా 27,064 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని అధికారుల అంచనా. కాగా ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలతో పాటు ఇతర ప్రైవేట్ షాపుల్లో సుమారు 13 వేల మెట్రిక్ టన్నుల మేర యూరియా ఉందని సమాచారం. యూరియా కోసం రైతులు ఇప్పటికే రోడ్ల మీదకు వచ్చి దుకాణాల ఎదుట క్యూలైన్లు కడుతున్నారు. ఎలాంటి గొడవులు జరగకుండా ముందస్తుగా పోలీసుల పహారాలో యూరియా బస్తాలను రైతులకు మితంగా అందిస్తున్నారు.
బుకింగ్ యాప్‌పై అవగాహన
ఇక నుంచి రైతులకు ఎరువులు కావాలంటే తప్పని సరిగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో బుక్ చేసుకుంటేనే ఎరువులు అందుతాయని రైతులు అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమ పేరు, పట్టా పాస్‌పుస్తకం నంబర్, ఇతర వివరాలు అందిస్తే అప్పటికే యాప్ ద్వారా రైతులు తమకు కావాల్సిన యూరియాను ఏ డీలర్‌వద్ద ఉంటే అక్కడ కొనుగోలు చేయొచ్చు. అయితే ప్రతి రైతు వద్ద స్మార్ట్‌ఫోన్ ఉండాలి. పాస్‌బుక్ నంబర్ కొడితే రైతు పేరు, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఉన్న భూమిలో ఎంత సాగు చేస్తున్నారు, ఏరకమైనా పంట వేశారు అనే అంశాలు వస్తాయి. పంటరకం, అందుకు అవసరమైన యూరియా బస్తాలను ఎంటర్ చేస్తే ఆన్‌లైన్ ద్వారా యూరియా బుక్ అవుతుందని చెబుతున్నారు. కాగా జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది రైతులు ఉండగా, 40 శాతం మంది రైతులు స్మార్ట్‌ఫోన్లు వాడటం లేదు.
వరి నాటుకు ఎకరానికి కేవలం రెండున్నర బస్తాల యూరియా మాత్రమే వాడాలని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సగం బస్తా ఇవ్వడం కుదరకపోవటంతో ఎకరం ఉంటే 3 బస్తాలు ఇస్తామని, 2 ఎకరాల్లో నాటు వేసే 5 బస్తాలు ఇస్తామని చెబుతున్నారు. అంతకుమించి యూరియా ఇవ్వబోమని, అంతకంటే ఎక్కువ ఉపయోగిస్తే భూసారం తగ్గి భవిష్యత్తులో పొలాలు దెబ్బతింటాయని పేర్కొంటున్నారు.


