మున్సిపోల్స్‌కు సమాయత్తం!
● ముసాయిదా ఓటరు జాబితా విడుదల
● అభ్యంతరాలు, ఫిర్యాదులకురెండు రోజులు అవకాశం
రామాయంపేట(మెదక్): జిల్లాలోని నాలుగు ము న్సిపాలిటీల్లో గురువారం అధికారులు వార్డుల వారీ గా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు. ఈ మేరకు జాబితాను ఓటర్లకు అందుబాటులో ఉంచారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు కోసం రెండు రోజులు అవకాశం కల్పించారు. ఈనెల 5న మున్సిపల్ కమిషనర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. 6న జిల్లా కేంద్రంలో రాజకీయ పార్టీలతో కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్‌స్టేషన్ల పునర్‌వ్యవస్ధీకరణ కార్యక్రమం పూర్తయింది. స్టేషన్ల సంఖ్య పెరుగకపోయినా కొన్ని మార్పులు చేశారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులకు గాను 24 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 11, 12 పోలింగ్ స్టేషన్లు గతంలో మార్కెట్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగగా, ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలమవటంతో దానిని ఉజ్వల విద్యాలయంలోకి మార్చారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2025 ఓటరు లిస్ట్‌ను ప్రామాణికంగా తీసుకొని ముసాయిదా బాబితా రూపొందించారు. కాగా అక్టోబర్ తర్వాత కొత్తగా ఒటర్‌గా నమోదైన యువకులకు ఈఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. అంతకుముందు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఈసారి ఫొటో ఆధారిత ఓటర్ లిస్టు ప్రవేశపెడుతున్నారు.
పోలింగ్‌స్టేషన్లలో సదుపాయాల పరిశీలన
నాలుగు మున్సిపాలిటీల పరిధిలో గుర్తించిన పో లింగ్ స్టేషన్లలో సదుపాయాలు, సమస్యలను అధికారులు పరిశీలించారు. మూత్రశాలలు, దివ్యాంగుల కోసం ర్యాంపులు లేకపోతే వెంటనే నిర్మించా ల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ఒక వార్డులో ఉన్న ఓటర్లు మరో వార్డులోకి మార్చుకునే అవకాశం ఉంటుందే తప్ప కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఉండదని స్పష్టం చేశారు. కాగా ఓటర్ లిస్టులో మృతిచెందిన వారి పేర్లు ఉంటే వాటిని తొలగించే అవకాశాలు లేవని తెలిసింది.


