కల్వకుర్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కారులోనే అరగంట పాటు ప్రాణాలతో పోరాడి.. బయటకు తీసే సమయానికే తుది శ్వాస విడిచారు. ప్రమాద స్థలంలో కళ్లుతెరిచి చూస్తున్న ఆమెను బయటకు తీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర విషాదానికి గురయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన అరుణ(57), ఆమె భర్త రాజేందర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. కోదాడ–రాయచూరు హైవేపై కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు చేరుకోగానే కారు టిప్పర్‌ను ఢీకొంది. ప్రమాదంలో అరుణ తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అరుణ కళ్లుతెరిచి చూస్తుండటంతో ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నించినా.. కారు ధ్వంసమై ఉండటంతో సాధ్యం కాలేదు. దీంతో స్థానికులు, బంధువులు జేసీబీని తీసుకొచ్చారు. కారులో నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలోనే అరుణ తుది శ్వాస విడిచారు. కాగా..అచ్చంపేటలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అరుణ శుక్రవారం పాఠశాలకు వెళ్లాల్సి ఉండటంతో రాత్రి భర్తతో కలిసి హైదరాబాద్ నుంచి బయలుదేరినట్లు బంధువులు తెలిపారు. ప్రమాదంలో రాజేందర్‌రెడ్డికి కాలికి గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
● కారులో చిక్కుకుని విలవిల్లాడిన ఉపాధ్యాయురాలు..
● బయటకు తీసేలోపే తుదిశ్వాస
● కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో రోడ్డు ప్రమాదం


