జూరాల ప్రధాన కాల్వకు నిలిచిన నీటి సరఫరా
అమరచింత: జూరాల ప్రాజెక్టుకు పూర్తిగా ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీటి గండం ఏర్పడింది. ఎగువన నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడం, వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు ప్రధానం కుడి, ఎడమ కాల్వలకు గత ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిపివేశారు. గతంలో కాల్వకు 4 రోజుల పాటు నీటిని వదిలి మిగిలిన 3 రోజులు నిలిపేస్తూ వారబందీ ద్వారా సాగునీటిని ఆయకట్టుకు ఇస్తారని అనుకున్న రైతన్న ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు చుక్కనీటిని కాల్వలకు వదలమని అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
5 టీఎంసీలు మాత్రమే..
ప్రస్తుతం ప్రాజెక్టులో 5.222 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో కేవలం తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాల్వలకు, ఎత్తిపోతలకు నీటి సరఫరా పూర్తిస్థాయిలో నిలిపివేశారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి కేవలం 200 క్యూసెక్కుల వరద మాత్రమే చేరుకుంటుందని అధికారులు తెలిపారు. జూరాల ప్రధాన ఎడమ, కుడి కాల్వలతో పాటు సమాంతర కాల్వ, భీమా లిఫ్ట్, కోయిల్‌సాగర్, నెట్టెంపాడ్, పవర్‌హౌజ్‌లకు నీటిని నిలిపివేశారు. దీంతో జూరాల ఆయకట్టులో ఈసారి కుడి, ఎడమ కాల్వ పరిధిలో 1.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్న రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
వరి రైతుల ఆందోళన..
జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలతో ఈసారి 5 లక్షల ఎకరాల మేరకు వరి పంట సాగు చేపట్టారు. ప్రతి ఏడాది వేసవిలో మాత్రమే సాగునీటి కష్టాలను ఎదుర్కొనే ఆయకట్టు రైతులకు వారబందీతో అతికష్టం మీద సాగునీటిని అందించే యత్నం చేసేవారు. వర్షాలు కురవడం లేదని ఎల్‌నినో ప్రభావం ఉందని ఆయకట్టులో వరి పంటను సాగుచేసుకోవద్దని అధికారులు రైతులకు ముందస్తు సమాచారం అందించారు. అయినా రైతులు మాత్రం జూరాలకు ఎగువ నుంచి వరద వచ్చి ముందుకు వెళ్తోందని తమ పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలంటూ వరి పంటలను సాగుచేయడంతో అసలు సమస్య మొదలైంది. అసలు వారబందీ ఉందా లేదా అనే విషయాన్ని ప్రాజెక్టు ఎస్‌ఈ చంద్రశేఖర్‌ను వివరణ అడగ్గా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాల్వలకు నీటి విడుదలను నిలిపేసినట్లు తెలియజేశారు. ఇంకా వారబందీపై ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటి అవసరాల మేరకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
కుడి, ఎడమ కాల్వలకు
నిలిపేసిన సాగునీరు
వరదలొస్తేనే విడుదలంటున్న
అధికారులు
ఆందోళనలో అన్నదాతలు


