మిడ్జిల్: వినాయక విగ్రహం తయారు చేసేందుకు బంకమట్టి తెచ్చుకుందామని అన్నతో కలిసి చెరువుకు వెళ్లిన 11 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. త మ్ముడు నీటిలో మునగడాన్ని గమనించిన అన్న వెంటనే అతడిని కాపాడేందుకు చెరువులోకి దిగి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటన గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొత్తపల్లికి చెందిన కావలి లక్ష్మయ్య, కళావతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నరేందర్, చిన్న కుమారుడు సాయితేజ (11). వినాయక చవితి సందర్భంగా విగ్రహం తయారు చేసేందుకు బంకమట్టి తెచ్చుకోవాలని ఇద్దరూ కలిసి గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లారు. ముందుగా సాయితేజ నీటిలోకి దిగి మట్టి తీస్తుండగా ప్రమాదవశాత్తు లోతులోకి జారిపోయి నీట మునిగాడు. తమ్ముడిని కాపాడేందుకు నరేందర్ వెంటనే నీటిలోకి దిగి రక్షించే ప్రయత్నం చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా సాయితేజను రక్షించలేకపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నరేందర్ గ్రామంలోకి పరుగెత్తుకెళ్లి విషయాన్ని చెప్పి, ఇతరులను వెంటబెట్టుకుని చెరువు వద్దకు వచ్చేలోపే సాయితేజ మృతి చెందాడు. విగ్రహం తయారు చేయాలన్న చిన్నారి ఆశ.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. పండుగ వేళ కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోదన గ్రామ స్తులను కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. సాయితేజ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.
చెరువులో మునిగి
బాలుడి మృత్యువాత
తమ్ముడిని కాపాడేందుకు
అన్న విశ్వప్రయత్నం..
అయినా దక్కని ఫలితం
వినాయక చవితి వేళ
కొత్తపల్లిలో విషాదం


