పాలమూరు: ఉమ్మడి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో సరిపడా పడకలు లేకపోవడంతో నిత్యం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రి టీచింగ్ ఆస్పత్రి స్థాయికి ఎదిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. నిత్యం ఓపీ, ఐపీ క్రమంగా పెరుగుతున్నా.. ఐసీయూలో పడకలు పెంచకపోవడంతో ప్రతి రోజు ఐదు నుంచి పది మంది రోగులు పడకల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు స్థానికంగా కన్పిస్తున్నాయి. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 900 పడకలు ఉన్న జనరల్ ఆస్పత్రిలో 650 పడకల్లో రోగులు అడ్మిట్ అవుతున్నారు. దీంట్లో 30 పడకలతో ఐసీయూ విభాగం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా నుంచి పాముకాటు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పక్షవాతం, ఇలా పరిస్థితి విషమంగా ఉన్న రోగులను వెంటిలేటర్ సహాయం కోసం ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 30 పడకలు ఏమాత్రం సరిపోవడం లేదు. బెడ్ ఎప్పుడు ఖాళీ అవుతుందని నిత్యం ఇతర రోగులు ఎదురుచూడాల్సి వస్తోంది.
రోగులపై ఆర్థిక భారం
ప్రస్తుతం రోగుల తాకిడి దృష్ట్యా కనీసం 60 పడకలతో ఐసీయూలో సేవలందిస్తే రోగులకు లబ్ధి జరగనుంది. నిత్యం ఐసీయూ విభాగానికి 10 నుంచి 20 కేసులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొత్తకోట, కోస్గి, ఇతర ప్రాంతాల నుంచి రోగులు వస్తుండగా.. అత్యవసరంగా వైద్య సేవలు అందించాల్సిన వారికి ఐసీయూ విభాగానికి సిఫారసు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అక్కడ సరిపడా బెడ్లు లేక రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు, హైదరాబాద్‌కు పరుగులు తీయాల్సి వస్తోంది. దీంతో పేద రోగులకు ఆర్థిక భారం పడుతుంది. అత్యవసరంగా మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ప్రైవేట్ అంబులెన్స్ నిర్వహకులు రూ.3,500నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు.
కరోనా సమయంలో..
జిల్లా జనరల్ ఆస్పత్రికి కరోనా సమయంలో దాదాపు 30 వెంటిలేటర్ మిషన్లు వచ్చాయి. దీంట్లో కొన్నింటిని ప్రస్తుత ఐసీయూ విభాగంలోని పడకలకు అమర్చారు. మిగిలిన 15 వెంటిలేటర్లను మూలకు పడేశారు. దీంతో దాదాపు నాలుగేళ్ల నుంచి అవి నిరుపయోగం ఉండటంతో మిషన్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో రూ.లక్షలు ఖర్చు చేసిన కొనుగోలు చేసిన మిషన్లు పేదలకు పనికిరాకుండా పోయాయి.
నెల రోగులు
జూన్ 350
జూలై 361
ఆగస్టు 391
30 ఐసీయూ పడకలతోనే
నెట్లుకొస్తున్న వైనం
రోజూ 10 నుంచి 20 అత్యవసర కేసులు
వెంటిలేటర్ మిషన్లు ఉన్న పడకలు
పెంచని అధికారులు


