మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) ముందు హైవేపై ఏర్పడిన గుంతలను ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు శ్రమదానంతో పూడ్చారు. గత కొన్ని రోజులుగా గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతుండటంతో సమీపంలోని మట్టిని గంపలతో తీసుకొచ్చి గుంతల్లో పోశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు గాలెన్న మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వాములు కావడం ద్వారా సామాజిక బాధ్యత, రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. శ్రమదానంలో విద్యార్థులు భరత్‌బాబు, బుగ్గేష్, ఆంజనేయులు, పవన్, యాదగిరి, ఉదయ్, మహే ష్, రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
పీయూలో ప్రజాపాలన వేడుకలు
పాలమూరు యూనివర్సిటీలో ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఎందరో చేసిన త్యాగాలను నేటితరం యువత గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత, విద్యావేత్తలు తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. పీయూ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాళ్లు కరుణాకర్‌రెడ్డి, భూమయ్య, ఈశ్వర్‌కుమార్, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రపంచంలో అభివృద్ధిలో భారతదేశం ముందుకు పోతున్నదని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సీమ నరేందర్ అన్నారు. నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని అమావాస్య అన్నదాన మండపం వద్ద జ్యోతి వెలిగించారు. రాష్ట్ర అధ్యక్షుడు సీమ నరేందర్ మాట్లాడుతూ నరేంద్రమోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి దేశాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతూ జ్యోతి వెలిగించి ఆ దేవుడిని ప్రార్థించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు నర్సింహరావు, అన్నదాన కమిటీ అధ్యక్షులు రఘురాంగౌడ్, మహిళా అధ్యక్షురాలు గీత, బాలప్రసాద్, శ్రీను, దశరథ్, కొండల్ పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి
అచ్చంపేట రూరల్: అనుమానస్పదంగా ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని సింగారంలో చోటు చేసుకుంది. సిద్దాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి బాల్‌నారి(63) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సా గిస్తున్నాడు. బాల్‌నారికి ఇద్దరు భార్యలు ఉన్నా రని పేర్కొన్నారు. మొదటి భార్య సాయిలమ్మ, కుమారుడు వెంకటయ్య, కోడలు, కుమార్తెలు బాలమ్మ, సైదమ్మ ఉన్నారు. రెండో భార్య కృష్ణమ్మ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల నుంచి ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. రెండో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ పోలీస్‌స్టేషన్ హెచ్‌సీ గౌతమ్ తెలిపారు.


